వాళ్ల జీవితాల్ని పట్టించుకోకపోతే.. వీళ్ల జీతాలు కట్!

 

తల్లిదండ్రులకి పిల్లలే జీవితం! అందుకే, నెల నెలా జీతాలు సంపాదించి జీవితాంతం వారి కోసం ఖర్చు చేస్తుంటారు. కాని, తీరా ఆ తల్లిదండ్రులు ముసలి వారై, పిల్లలు సంపాదన మొదలు పెడితే? ఇప్పటికీ మన దేశంలో చాలా మంది సంతానం తమ తల్లిందండ్రుల్ని చక్కగానే చూసుకుంటున్నారు. కాని, రోజు రోజుకు పేరెంట్స్ ని పట్టించుకోని పిల్లలు ఎక్కువైపోతున్నారు. తాము వారి మీద ఆధారపడ్డప్పుడు ఎంతో ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని కొందరు పిల్లలు పెద్దవ్వగానే పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. తమ కోసం ఏమీ తీసి పెట్టుకోకుండా అంతా పిల్లలకే ధారపోసిన ఆ ముసలి వారు నానా కష్టాలు, అవమానాలు పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక నరకం అనుభవిస్తున్నారు!

 

పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రులకి కొంత ఆసరా అయ్యేలా అసోంలోని బీజేపి ప్రభుత్వం ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. త్వరలో అక్కడ ఒక రూల్ రానుంది. దాని ప్రకారం గవర్నమెంట్ ఉద్యోగం వుండీ... తమ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తోన్న కొడుకుల జీతాల్లో కోత విధించనున్నారు! ఆ మొత్తాన్ని అమ్మా, నాన్నలకు ఇచ్చి వారి జీవితం దుర్భరం కాకుండా చూస్తుంది ప్రభుత్వం. ఇది ప్రాక్టికల్ గా ఎలా వర్కవుట్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. తల్లిదండ్రుల్ని కొడుకు సరిగ్గా చూసుకోవటం లేదని గవర్నమెంట్ కి ఎలా తెలుస్తుంది? పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తేనే కట్ జీతం కట్ చేస్తారా? ఒకవేళ చేసినా ఎంత? ఎలాగా? లాంటి బోలెడు ప్రశ్నలు వున్నాయి. అన్నీ త్వరలో జరగనున్న అసోం అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు పాసైతే మనకు తెలిసిపోతాయి!

 

అసోమ్ ప్రభుత్వం తెస్తోన్న కొత్త రూల్ వల్ల ఎంత మంది తల్లిదండ్రులకి ఎంత మేర ఉపయోగం వుంటుంది? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. పైగా ప్రభుత్వ ఉద్యోగులు కాని కొడుకులు తమ అమ్మా, నాన్నల్ని గాలికి వదిలేస్తే? అప్పుడు గవర్నమెంట్ కూడా చేయగలిగింది ఏం లేదు! అయినా కూడా గవర్నెమెంట్ ఉద్యోగుల్లో అయితే తమని కన్నవారిపై భయ, భక్తుల్ని కల్పించటం .. మెచ్చుకోదగ్గ పరిణామమే!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu