పంచిన డబ్బులు ఇచ్చేయండి అభ్యర్థి అగ్రహం
posted on: Feb 12, 2026 4:20PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో చిత్ర విచిత్రమైన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని మండిపడుతూ ఓ కాంగ్రెస్ అభ్యర్థి నడ్డిరోడ్డుపై హంగామా చేయడం చర్చనీయాంశ మైంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, ఎన్నికల సమయం లో పంచిన డబ్బులు మరియు కుక్కర్లు వెనక్కి ఇవ్వాలని ప్రజలను డిమాండ్ చేస్తూ“నాకు ఓటు వేయకపోతే పంచిన డబ్బులు, కుక్కర్లు ఎందుకు తీసుకున్నారు?” అంటూ ప్రజలను నిలదీస్తూ అవమానకరంగా మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఆ అభ్యర్థి నడ్డిరోడ్డుపై రచ్చ రచ్చ సృష్టించడంతో అక్కడికి చేరుకున్న ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యచకితు లయ్యారు. అభ్యర్థి చేసిన వ్యాఖ్యలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “డబ్బులు, కుక్కర్లు ఇవ్వమని ఎవరడిగారు? ఎందుకు ఇలా అవమానిస్తు న్నారు?” అంటూ పలువురు ప్రజలు అతన్ని ప్రశ్నించారు. ఈ ఘటనతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు ఈ వ్యవహారాన్ని వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియా లో షేర్ చేయడంతో విషయం మరింత వైరల్ అయింది.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాల్సిన సందర్భంలో, ఓటు వేయలేదనే కారణంతో ప్రజలను అవమానించడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటనపై ఎన్నికల అధికారులు లేదా పోలీసుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఎన్నికల సమయంలో డబ్బులు లేదా బహుమతులు పంచడం చట్టవిరుద్ధమనే విషయం తెలిసిందే. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపడతారా.. లేదా వేచి చూడాల్సిందే..అశ్వారావుపేటలో చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.






