ఉజ్జయిని మహంకాళి బోనాల్లో తొలిసారి ‘ఏఐ’ నిఘా.. !

posted on: Aug 2, 2026 1:01PM

 

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనార్..! 

ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ ఆదివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల పండుగకు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. నగరవ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయని తెలిపారు. 

ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల జాతరలు ప్రశాంతంగా ముగిశాయని, ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజా అమ్మవార్ల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలకు భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో సుమారు 2,500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. భక్తుల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్, నిఘా వ్యవస్థను ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.

ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. దీని ద్వారా పాత నేరస్థులు, గొలుసు దొంగలు, జేబుదొంగలను వేగంగా గుర్తించి పోలీసులను అప్రమత్తం చేసే అవకాశం ఉంటుం దన్నారు.ఆలయంలోకి వచ్చే, బయటకు వెళ్లే భక్తుల సంఖ్యను క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా కచ్చితంగా లెక్కించనున్నట్లు సీపీ వివరించారు. ఆలయంలోని వివిధ ప్రాంతాలు, క్యూలైన్లలో భక్తుల రద్దీ సాంద్రతను ‘థ్రెషోల్డ్ మ్యాపింగ్’ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. 

ఏదైనా ప్రాంతంలో రద్దీ నిర్దేశిత పరిమితిని మించితే ముందుగానే అప్రమత్తమై అవసరమైన చర్యలు చేపడతామని, తద్వారా తొక్కిసలాట వంటి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.బోనాల ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా దేవాదాయ శాఖ, జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని సీపీ తెలిపారు. భక్తులందరూ పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ఐపీఎస్, ట్రాఫిక్-1 డీసీపీ అవినాశ్ కుమార్, ఐపీఎస్, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Ashada Bonalu, Minister Ponnam Prabhakar, Ujjain Mahakali Ammavari Bonalalu, Hyderabad Bonalu Celebrations, Telangana Spiritual News, Telangana Goverment, CP VC Sajjanar, AI surveillance


 

google-ad-img
    Related Sigment News
    • Loading...