విమానాల్లోనూ ఇ20.!

posted on: Aug 6, 2026 12:02PM

కేంద్ర ప్రభుత్వం వాహనాల పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని పెంచుతూ తీసుకుంటున్న నిర్ణయాలపై  దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలకు ఆజ్యం పోశారు  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.  

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు. విమానాల ఇంధనంలోనూ ఇథనాల్ మిశ్రమం చేస్తే..   విమానాల ప్రయాణ భద్రతపై తీవ్రమైన ప్రభావం పడుతుందని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ ఆరోపణ చేశారు.   తనకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు విమాన రవాణా రంగానికి సరఫరా చేసే ఇంధనంలో ఇథనాల్‌ను కలపాలని ప్రభుత్వం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసిందని పేర్కొన్న కేజ్రీవాల్..  విమానయాన రంగానికి చెందిన నిపుణులు,  టెక్నాలజీ ఎక్స్ పర్ట్ ల అభిప్రాయం ప్రకారం విమాన ఇంధనంలో ఇథనాల్ వంటి పదార్థాలను మిశ్రమం చేయడం వల్ల ఇంజన్ల పనితీరు దెబ్బతినడమే కాకుండా..  గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు సాంకేతిక లోపాలు తలెత్తే అవకాశం ఉందన్నారు కేజ్రీవాల్. దీనివల్ల వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు  ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

సాధారణంగా నేలపై నడిచే వాహనాలకు వాడే పెట్రోల్‌లో ఇథనాల్ కలపడానికీ, ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే విమాన ఇంధనంలో కలపడానికీ చాలా వ్యత్యాసం ఉంటుందన్న కేజ్రీవాల్.. విమానాలు   ప్రతికూల వాతావరణ పరిస్థితులలో,  అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ప్రయాణిస్తాయనీ,  ఇలాంటి పరిస్థితులలో ఇంధనంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నా అది ఇంజన్ స్తంభించిపోవడానికి లేదా ఇతర సమస్యలకూ దారితీసే అవకాశం ఉంటుందన్నారు.  నిపుణులు ఈ తరహా ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని కేజ్రీవాల్ తన పోస్టులో పేర్కొన్నారు. 

ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న ఈ-20 విధానంపై ఇప్పటికే వాహనదారుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇథనాల్ శాతం పెరగడం వల్ల వాహనాల ఇంజన్లు త్వరగా పాడైపోతున్నాయని, మైలేజ్ తగ్గిపోతోందని వినియోగదారులు ఆరోపించడమే కాదు..  నిపుణులు కూడా ఈ 20 వినియోగం వల్ల ఇంజన్లు పాడైపోతాయనీ, మైలేజీ తగ్గుతుందనీ ధృవీకరిస్తున్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా పార్లమెంటు వేదికగా మైలేజీ తగ్గుతుందని అంగీకరించారు కూడా. ఆ సమస్య పరిష్కరించకుండానే.. ఇప్పుడు ఎన్డీయే సర్కార్.. ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని విమానాలకు కూడా వర్తింప చేయడానికి కసరత్తు చేస్తోందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది.  శాస్త్రీయ అధ్యయనం లేకుండా మోడీ సర్కార్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు సిద్ధపడుతోందన్నవిమర్శలు వ్యక్తమౌతున్నాయి. ముందుకు సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్   స్వచ్ఛమైనదిగా ఉండాలని, అందులో ఎలాంటి మార్పులు చేసినా విమానయాన సంస్థలకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. 

అదలా ఉండగా.. కేజ్రీవాల్   ఆరోపణలపై   కేంద్రం నుంచి కానీ,  పౌర విమానయాన మంత్రిత్వ శాఖనుంచి కానీ ఎటువంటి స్పందనా ఇప్పటి వరకూ రాలేదు. దీంతో విమానాల ఇంధనంలో కూడా ఇథనైల్ మిశ్రమం అన్న ఆరోపణలకు మరింత బలం చేకూరుతోందని పరిశీలకులు అంటున్నారు.  

Arvind Kejriwal lleges E20 in flights,   Ethanol Blending, Aviation Turbine Fuel ATF,  Modi Government, Flight Safety

google-ad-img
    Related Sigment News
    • Loading...