రంగంలోకి కేజ్రీవాల్ కూతురు
posted on May 18, 2015 3:22PM

ఈ సృష్టిలోని జీవులన్నిటికీ వుండే లక్షణం... తమ సంతానం బాగుండాలని కోరుకోవడం. తమ సంతానం అభివృద్ధి చెందాలని ఆశించడం. మనుషులు కూడా దీనికి అతీతులేమీ కాదు.. ఆ మాటకొస్తే మిగతా అన్ని జీవుల కంటే మనుషులకే ఈ తాపత్రయం ఎక్కువ. తమ వారసులు కూడా తమలాగే అభివృద్ధి చెందాలి. సినిమా ప్రముఖులు తమ వారసులను రంగంలోకి దించుతారు. వ్యాపారులు తమ వారసులను కూడా వ్యాపారంలో దించుతారు. లైమ్‌లైట్‌లో వుండే ఏ ఫీల్డులో రాణిస్తున్నవారైనా తమ సంతానం కూడా తమ బాటలోనే నడిచి రాణించాలని కోరుకుంటారు. రాజకీయ రంగంలో అయితే ఈ కోరిక చాలా ఎక్కువగా వుంటుంది. రాజకీయ నాయకుల పుత్రరత్నాలు, పుత్రికా రత్నాలు తమ తల్లిదండ్రుల బాటలో నడుస్తూ అధికారం, పదవులు ఆస్వాదించడం చూస్తూనే వున్నాం. ఇదే బాటలో ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా నడుస్తున్నారు. తన కుమార్తె హర్షితా కేజ్రీవాల్‌ని తన రాజకీయ వారసురాలిగా ప్రజల ముందు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తండ్రి ఆకాంక్షను నెరవేర్చేందుకు హర్షితా కేజ్రీవాల్ రంగంలోకి దిగారు. ఢిల్లీ ప్రజల దృష్టిని మాత్రమే కాదు.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.
అసలేం జరిగిందంటే, అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షితా కేజ్రీవాల్ తనకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్ళారట. తన దగ్గర అన్ని పత్రాలూ ఉన్నప్పటికీ అక్కడున్న అధికారితో తన దగ్గర ఒక పత్రం లేదని, లంచం ఇస్తానని అన్నారట. అయితే ఆ అధికారి లంచం తీసుకోవడానికి నిరాకరించడంతోపాటు ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి నిరాకరించాడట. ఆ తర్వాత హర్షితా కేజ్రీవాల్ అన్ని పత్రాలనూ సమర్పించి డ్రైవింగ్ లైసెన్స్ పొందారట. ఇది ఒక సమావేశంలో పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్ తన కుమార్తె హర్షిత చేసిన ఘనకార్యం గురించి గర్వంగా చెప్పుకున్న తీరు. తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో అవినీతి బాగా తగ్గిందని చెప్పడం కోసం కేజ్రీవాల్ఈ ఉదంతాన్ని చెప్పుకున్నారు. అయితే దీని వెనుక ఒకే దెబ్బకు రెండు పిట్టల తరహాలో తన కుమార్తెని తన రాజకీయ వారసురాలిగా తీర్చిదిద్దడం, ఆ విషయాన్ని అందరికీ తెలియజేసే ఆలోచన కూడా వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేజ్రీవాల్ కుమార్తె హర్షిత ఢిల్లీ ప్రజలకు చాలా సుపరిచితురాలు. గత ఎన్నికలలో ఆమె తండ్రితో కలసి ప్రచారం కూడా చేశారు. ఆమె ముఖం తెలియని వాళ్ళు ఢిల్లీలో చాలా తక్కువ. అలాంటిది ఒక ఆర్టీఏ అధికారికి ఆమె తెలియకుండా ఎలా వుంటారు? అందుకే సదరు అధికారి లంచం తీసుకోవడానికి నిరాకరించి వుండవచ్చు. అలాగే ఎంత పెద్ద లంచగొండి అయినా లంచం ఇస్తా తీసుకో అంటే పొరపాటున కూడా తీసుకోడు. హర్షిత లంచం ఇస్తానని అన్నప్పుడు అలాగే జరిగి వుండవచ్చు. లేదా అతను నిజాయితీపరుడు కూడా అయి వుండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఈ ఉదంతాన్ని బయట పెట్టడం ద్వారా కేజ్రీవాల్ తన ప్రభుత్వం గురించి భజన చేసుకోవడంతోపాటు తన కుమార్తె తన రాజకీయ వారసురాలు అని ఢిల్లీ ప్రజలకు హింట్ కూడా ఇచ్చేశారు.