Latest News

ఈ గురుశిష్యుల గోలేంటో!

posted on: Mar 25, 2014 1:49PM

 

జనాన్ని కన్ఫ్యూజ్ చేయడంలో గురువే పెద్ద మాస్టర్ అనుకుంటే, శిష్యుడు గురువుకంటే పెద్ద ముదురులా కనిపిస్తున్నారు. ఈ గురుశిష్యులిద్దరికీ ప్రస్తుతం ఒకరంటే ఒకరికి పడకపోయినప్పటికీ వెరైటీ స్టేట్‌మెంట్లు ఇవ్వడంలో మాత్రం ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. ఇంతకీ ఎవరా గురుశిష్యులనుకుంటున్నారా? ఇంకెవరూ ఘనతవహించిన అన్నా హజారే... అరవింద్ కేజ్రీవాల్. మొదట అన్నా హజారే విషయానికి వస్తే, కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అయినప్పుడు అన్నా హజారే కేజ్రీవాల్‌కి తన మద్దతు వుండదని ప్రకటించాడు. అన్నా మద్దతు లేకపోయినా కేజ్రీవాల్ ఢిల్లీ మీద ప్రభావం చూపించాడు. నలభై రోజులపాటు ముఖ్యమంత్రి గిరీ వెలగబెట్టాడు. కేజ్రీ ముఖ్యమంత్రి కాగానే అన్నా చాలా మురిసిపోతూ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడం తనకి సంతోషాన్ని కలిగిస్తోందని, తాను ఇది ముందే ఊహించానని చెప్పాడు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే అన్నా ప్రేమని కురిపిస్తున్నాడని అప్పుడు జనం అనుకున్నారు. అలాగే మొన్నీమధ్య మమతా బెనర్జీ అన్నాని కలిసి ఆయన కాళ్ళమీద పడిపోయింది. దాంతో మురిసిపోయిన అన్నా ఈ ఎన్నికలలో తన మద్దతు మమతా బెనర్జీకే వుంటుందని ప్రకటించాడు. వారం తిరిగిందో లేదో మమతా బెనర్జీకి తన మద్దతు లేదని మళ్ళీ ప్రకటించాడు. మనసెందుకు మార్చుకున్నావు పెద్దాయనా అంటే మమత నచ్చిందిగానీ, ఆమె చుట్టూ వున్నవాళ్ళు మాత్రం తనకి నచ్చలేదని, అందుకే మమతకి మద్దతు ఉపసంహరించానని సెలవిచ్చారు. అన్నా చేసే కంగాళీ ఇలా వుంటే, కేజ్రీవాల్ చేసే క్రేజీ పనులు మరోలా వున్నాయి. ముఖ్యమంత్రిగా నలభై రోజులు వెలగబెట్టి పరువు మొత్తం పోగొట్టుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు ఇస్తున్న స్టేట్‌మెంట్లు చాలా విచిత్రంగా వుంటున్నాయి. మీడియా బీజేపీకి అమ్ముడు పోయిందని, మీడియా ప్రతినిధులని జైల్లో పెట్టిస్తానని కేజ్రీవాల్ అన్న మాటలు పెద్ద దుమారాన్నే సృష్టించాయి. ఆ తర్వాత రాజకీయ నాయకులకు సహజమైన ‘నేనలా అనలేదు.. నా మాటల్ని వక్రీకరించారు’ అంటూ కేజ్రీవాల్ తప్పించుకున్నాడు. నిన్నగాక మొన్న వారణాసిలో నరేంద్రమోడీ మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి, ఆ తర్వాత తనకి అంత సీన్ లేదని అర్థం చేసుకున్నాడు. రెండు చోట్ల పోటీ చేయడం మా పార్టీ సిద్ధాంతానికి విరుద్ధమని ఆ తర్వాత ప్రకటించాడు. మొత్తమ్మీద జనాన్ని అయోమయానికి గురిచేయడంలో గురుశిష్యులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...