Latest News
25న రథ సప్తమి.. అర్థ బ్రహ్మోత్సవానికి తిరుమలలో ఏర్పాట్లు
posted on: Jan 19, 2026 3:44PM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. సకల జీవకోటికి వెలుగు ప్రదాత అయిన సూర్య భగవానుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన ఈ ఉత్సవాన్ని అత్యంత కన్నుల పండువగా నిర్వహించడానికి టీటీడీ సన్నద్ధమౌతోంది. రథ సప్తమి సందర్భంగా ఒకే రోజు స్వామి వారు ఏడు వేర్వేరు వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. అందుకే తిరుమలలో జరిగే రథసప్తమి వేడుకను అర్ధ బ్రహ్మోత్సవం అంటారు. ఈ ఉత్సవం ఉదయం సూర్యోదయ వేళ సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై, ఆపై వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తు లను కటాక్షిస్తారు.
చివరగా రాత్రికి జరిగే చంద్రప్రభ వాహన సేవతో ఈ రథసప్తమి సంబరాలు ముగుస్తాయి. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడిని ఒకే రోజు ఇన్ని రూపాల్లో దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, తాగునీరు , అన్నప్రసాదాల పంపిణీ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. కాగా రథ సప్తమి సందర్భంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇక సుప్రబాత, తోమాల, అర్చన సేవలను ఏకాంతంలో నిర్వహిస్తారు.






