వైభవంగా దివంగత ఆరిగపూడి విజయ కుమార్ జన్మదిన వేడుకలు
posted on Nov 1, 2025 7:52PM

కళా సాహిత్య సేవా రంగాలకు అనితరసాధ్యమైన సేవలు చేసిన దివంగత లయన్ డా.ఆరిగపూడి విజయకుమార్ మానవతా పతాకమని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అభివర్ణించారు. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ కవి,కళారత్న డా.బిక్కికృష్ణ అధ్యక్షతన లయన్ ఆరిగపూడి విజయకుమార్ జన్మదినవేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
తల్లిదండ్రులు ఆరిగపూడి పూర్ణచంద్రరావు, నాంచారమ్మల ప్రేరణతో డా.విజయకుమార్ చిన్ననాడే దాతృత్వగుణాన్ని పెంపొందించుకొని కోట్లాది రూపాయలు దానం చేయడం ఆయన మానవత్వానికి,సేవా తత్వానికి పరాకాష్టగా వక్తలు తెలిపారు. ఈ వేడుకల్లో అతిథులుగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ ,తెలంగాణ బి.సి.కమీషన్ మాజీ చైర్మన్ బి.ఎస్.రాములు , ప్రముఖ కవులు డా.పి.విజయలక్ష్మి పండిట్,డా.జెల్ది విద్యాధర్,వంశీ రామరాజు,డా.రాధా కుసుమ, పద్మశ్రీలత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొలకలూరి ఇనాక్ రాసి,విజయకుమార్ కు అంకితమిచ్చిన "చలన సూత్రం" గ్రంథాన్ని,బి.ఎస్.రాములపై వచ్చిన "విరబూసిన బతుకు చెట్టు" గ్రంథాన్ని అతిథులు ఆవిష్కరించారు. కవయిత్రి డా.రాధా కుసుమ నిర్వహణలో జరిగిన స్వర్గీయ విజయకుమార్ స్మారక కవి సమ్మేళనం ఆర్ద్రంగా జరిగింది.