Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పిల్లలకు ఐస్ క్రీమ్ కొనిస్తున్నారా...అయితే తస్మాత్ జాగ్రత్త!
posted on: Mar 26, 2026 5:23PM

హైదరాబాద్ నగరంలో కల్తీ వ్యాపారం రోజురోజుకూ భయానకర రూపందాలుస్తోంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టంగా తినే ఆహార పదార్థాలే ఇప్పుడు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. ఇటీవల కుళ్ళిన గుడ్లు, ప్రమాదకర రసాయనాలతో కేక్స్, డోనట్స్ తయారు చేస్తున్న ముఠాను పట్టుబడిన విషయం మరువకముందే, తాజాగా ఐస్‌క్రీమ్‌ల పేరుతో మరో భారీ కల్తీ వ్యాపారం బయటపడింది. ఈరోజు ఉదయం ముషీరాబాద్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో కల్తీ, అపరిశుభ్రమైన మరియు గడువు ముగిసిన ముడి పదార్థాలతో ఐస్‌క్రీమ్ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తూ... భారీ ఎత్తున లాభాలు అర్జిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
విశ్వసనీయ సమాచారం మేరకు కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు, జీహెచ్‌ఎంసీ ఆహార భద్రతా అధికారులతో కలిసి బాపూజీ నగర్‌లోని “బ్లూ బెల్స్ ఐస్ క్రీమ్” పేరిట నడుస్తున్న ఐస్ క్రీం దుకాణంపై దాడులు నిర్వహించాయి. ఎటువంటి సరైన లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఐస్‌క్రీమ్ తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యాపారం కొనసాగిస్తున్న ప్రధాన నిందితుడు పట్టాల అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ సమయంలో భారీ ఎత్తున గడువు తీరిన ముడి పదార్థాలు, కృత్రిమ రంగులు, రసాయనాలు ఉపయోగించి ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్నట్లు అధికారులు బయటపెట్టారు.
తయారైన ఉత్పత్తులను నాణ్యమైన బ్రాండెడ్ ఐస్‌క్రీమ్‌లుగా తప్పుడు ప్రచారం చేస్తూ హోల్‌సేల్ మరియు రిటైల్ మార్కెట్లో విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు వెల్లడైంది. ఫ్యాక్టరీలో నిల్వ పరిస్థితులు కూడా అత్యంత దారుణంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ముడి పదార్థాలు, తయారైన ఐస్‌క్రీమ్ ఉత్పత్తులు అసురక్షిత వాతావరణంలో అస్తవ్యస్తంగా నిల్వ చేయబడటంతో అవి మానవ వినియోగానికి పూర్తిగా అనర్హంగా మారినట్లు గుర్తించారు. దాడుల సమయంలో వివిధ రకాల ఐస్‌క్రీమ్‌లు, కృత్రిమ రంగులు, గడువు ముగిసిన ఫ్లేవర్లు కలిపి సుమారు రూ.1.75 లక్షల విలువైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసిన వస్తువులతో సహా తదుపరి చర్యల కోసం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. నగరంలో పెరుగుతున్న కల్తీ ఆహార వ్యాపారంపై పోలీసులు మరింత కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కల్తీ ఆహారం తయారీ, విక్రయం ఘటనలు వరుసగా బయట పడుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద ఆహార ఉత్పత్తులపై వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.






