తెలంగాణ వాదులు యురోపియన్లూ ఒకటేనా!?

posted on: Jun 4, 2026 12:44PM

తెలంగాణ వాదం, యురోపియన్ వాదం ఒకటేనా? అంటే అవుననే అనాలనిపిస్తోంది. ఇందులో మరెలాంటి డొంకతిరుగుడు లేదు. ఇక్కడ అదే నిజమనిపిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు సిలికాన్ వ్యాలీని గ్రౌండ్ జీరో నుంచి నిర్మించి.. ఇవాళ దాన్ని బిలియన్ డాలర్ వ్యవస్థగా మార్చింది భారతీయ వలస వాదులే. ఈ మొత్తం ఎంతంటే.. వారు ఉన్నది ఒకటిన్నర శాతమే అయినా.. వారు చెల్లిస్తున్న పన్నులే అమెరికా ఆర్ధిక వ్యవస్థలో సుమారు ఆరు శాతంగా ఉంది. ఈ మొత్తం విలువ భారతీయ కరెన్సీలో చెబితే అక్షరాలా   2,650 లక్షల కోట్ల రూపాయలు. దీన్నిబట్టే  చెప్పొచ్చు  భారతీయుల శ్రమ ఇక్కడి దేశాభివృద్ధికి ఎంత దోహదపడుతోందో.

ఇప్పుడు చూస్తే.. వారిని మీరు ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెబుతున్నారు. మీది భారతదేశం కదా? ఇక్కడేం పనీ.. అంటూ వారిని తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ఒకప్పుడు  కేవలం సాఫ్ట్‌వేర్ కూలీలుగా అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులు, ఇవాళ సిలికాన్ వ్యాలీలో.. కనీసం 6 నుంచి 7 ట్రిలియన్ డాలర్ల గ్లోబల్ టెక్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నారు, వీటి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.

తెలంగాణ పరిస్థితి కూడా అంతే.. ఇక్కడ మీకేం పని వెళ్లిపోండి! అంటూ ప్రస్తుతం కొందరు తెలంగాణ వాదులు ఆంధ్రులను అంటున్నారు. హైదరాబాద్, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ సంపద సృష్టి అంటే.. పారిశ్రామిక పెట్టుబడులు, కార్పొరేట్ ట్యాక్స్ కాంట్రిబ్యూషన్‌లో ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారుల వాటా   40  నుంచి 50శాతం వరకు ఉంటుందని అంచనా.  ఫార్మా, రియల్ ఎస్టేట్, సినిమా, మీడియా, ఐటీ, బ్యాంకింగ్ రంగంలో.. మొత్తం కలిపితే, మూడున్నర లక్షల కోట్లు వీరి వాటా ఉన్నట్టు చెబుతారు నిపుణులు. పెట్టుబడులు ఆరున్నర లక్షల కోట్ల వరకూ ఉంటుందని ఒక అంచనా.

ఇదంతా చూసి.. ఇప్పుడు ఇదంతా మాది.  ఈడికెళ్లి నుంచి వెళ్లి పోండి అనడం చూస్తుంటే..  ఇదంతా ఒక యురోపియన్ ఆలోచనా విధానంగానే భావించాలి. యురోపియన్లు కూడా అంతే.. తమది కాని అమెరికాలో   వలసవాదులుగా ప్రవేశించారు. అసలు అమెరికన్లు   స్థానిక రెడ్ ఇండియన్లు. కానీ ఇక్కడ వారికంటూ ఎలాంటి ప్రాతినిథ్యం లేనట్టుగానే మారిపోయింది. ఇక్కడ వారి ఉనికి భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అంతగా వారిని నామరూపాల్లేకుండా చేశారు. 

ఒకప్పుడు తాము అమెరికాను దురాక్రమించాక.. బానిసలుగా ఆఫ్రికన్లను తీసుకొచ్చి.. అటు పిమ్మట వారి ద్వారా- ఇక్కడ దేశ నిర్మాణం చేశారు. ఆ తర్వాత మెక్సికన్ల ద్వారా కావల్సినంత గొడ్డు చాకిరీ చేయించుకున్నారు. ఇక భారతీయుల ద్వారా స్పేస్, మెడిసిన్,  లా,  సాఫ్ట్ వేర్ రంగాల్లో కావల్సిన సేవలను పొందారు. మొత్తంగా ఒక అమెరికా అంటూ రూపకల్పన జరిగాక.. ప్రపంచంలోనే అగ్రరాజ్యం అనే పేరు సాధించిన ఈ కస్టమర్ బేస్డ్ డిపెండెంట్ కంట్రీ..  ఇవాళ అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండని అంటోంది. ఇటీవల ఒక భారతీయ జంటను,  ఒక అమెరికన్ ఈ మాటలనడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఒక వ్యవస్త ఏర్పాటు అయ్యే వరకూ ఓపిక పట్టడం..  ఆపై వారిని అక్కడి నుంచి తరిమిగొట్టడం ఇవన్నీ.. యురోపియన్ ఆలోచనా విధానాలే. యురోపియన్లు ఏదీ కష్టపడి సాధించేది ఉండదు. బ్రిటన్ యువరాణి ఏ కూలిపనో చేసి తన వజ్రాల కిరీటం సంపాదించుకోలేదు. ఇదంతా దోపిడీ సొమ్మే. ఆయా రాజ్యాలను ఆక్రమించుకుని దోచుకున్న సొమ్ము. లండన్లో ఒక చిన్న గదిలో ఈస్టిండియా కంపెనీగా పురుడు పోసుకుని భారత్ కి వచ్చి ఆనాడే మూడు లక్షల కోట్ల డాలర్ల మేర సంపదను ఇక్కడి నుంచి తరలించుకెళ్లింది బ్రిటన్ సామ్రాజ్యం. ఇలాంటి దోపిడీల గురించి రాసుకుంటూ పోతే చాలానే ఉంటుంది.

అందులో భాగంగానే, వాళ్లు పోలీసు, మెకాలే విద్య, పోస్టల్, రైల్వే వంటి వ్యవస్థలను ఇక్కడి జాతికి పరిచయం చేశారు. అంతే తప్ప ఇదేదో వారి ఉదారవాద తార్కాణం కాదు. పైపెచ్చు ఇక్కడున్న నిమ్న వర్గాల వారి అసంతృప్తిని వాడుకుంటూ క్రిష్టియానిటీని సైతం ప్రవేశ పెట్టి పోయారు.

ఇక ఇప్పుడు.. అసలు నిజంగా తెలంగాణ ఎవరిది? ఎవరెవరు ఈ ప్రాంతాన్ని ఏలారు? అసలు ల్యాండ్ లార్డ్స్ ఎవరు? ఒరిజినల్ తెలంగాణ ఎవడబ్బ జాగీరని ప్రశ్నించుకుంటే.. మొదట శాతవాహనులు, ఆ తర్వాత కాకతీయులు, ఆ తర్వాత కుతుబ్ షాహీలు, ఆపై అసఫ్ జాహీలు.. వీరే నిజాములు. వీరు 1724 నుంచి 1948 వరకూ అంటే సుమారు 224 ఏళ్లు పాలించారు. ఆనాడే వీరికి సొంత కరెన్సీ, రైల్వే, ఉస్మానియా వంటి వర్శిటీలుండేవి.

నిజాం సైన్యం, రజాకార్లు తెలంగాణ గ్రామాల్లో పడి ప్రజలను, కమ్యూనిస్ట్ గెరిల్లాలను వేటాడుతున్నప్పుడు..  వారు తప్పించుకోవడానికి సరిహద్దుల్లో ఉన్న ఆంధ్ర ప్రాంతాలు.. మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలు వీరికి ఆశ్రయం ఇచ్చాయి. బోర్డర్ దాటి వచ్చిన తెలంగాణ పోరాట యోధులకు ఆంధ్ర ప్రజలు ఇళ్లు, తిండి ఇచ్చి దాచారు. ఆయుధాల సరఫరా విషయానికి వస్తే.. తెలంగాణ గెరిల్లా దళాలకు అవసరమైన తుపాకులు, మందుగుండు సామగ్రిని.. బ్రిటిష్ ఆంధ్రా ప్రాంతం నుంచే రహస్యంగా తెలంగాణ సరిహద్దుల్లోకి రవాణా చేసేవారు. ఆర్థిక, వైద్య సహాయం సంగతికి వస్తే, గాయపడిన తెలంగాణ వీరులకు విజయవాడ, గుంటూరు ఆసుపత్రులలో రహస్యంగా చికిత్స అందించేవారు. ఈ పోరాటం కోసం ఆంధ్ర రైతులు, మేధావులు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి ఇచ్చారని చెబుతుంది చరిత్ర. 

తెలంగాణ ప్రజల విముక్తి కోసం.. ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసిన కొందరు ప్రముఖ ఆంధ్ర నాయకులు, మేధావులు ఎవరని చూస్తే.. చండ్ర రాజేశ్వరరావు. ఈయన కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాట వ్యూహాలను మరీ ముఖ్యంగా గెరిల్లా వార్‌ఫేర్ రూపొందించడంలో ఈయన పాత్ర చాలా కీలకం. స్వయంగా తెలంగాణ అడవుల్లో తిరిగి దళాలను నడిపించారు.

 అలాగే పుచ్చలపల్లి సుందరయ్య. నెల్లూరు జిల్లాకు చెందిన ఈయన  తెలంగాణ సాయుధ పోరాటం, దాని పాఠాలు అనే ప్రసిద్ధ గ్రంథాన్ని కూడా రాశారు. తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి ఆంధ్రా కమ్యూనిస్టుల తరపున పూర్తి సైద్ధాంతిక, ఆయుధ మద్దతు అందించారు.

ఇక మాకినేని బసవపున్నయ్య. గుంటూరు జిల్లాకు చెందిన ఈయన నాటి పోరాటంలో అగ్రగామిగా నిలిచారు. గెరిల్లా దళాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఇంకా మోటురు హనుమంతరావు, కంభంపాటి సత్యనారాయణ.  వీరు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి పత్రికల ద్వారా, కరపత్రాల ద్వారా తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను ప్రపంచానికి చాటారు.  

తెలంగాణ సాయుధ పోరాటం అనేది కేవలం ఒక ప్రాంతీయ ఉద్యమం కాదు. అది తెలుగు వారి సంయుక్త వీరగాథ.  నిజాం నియంతృత్వం నుంచి తమ తోటి తెలుగు ప్రజలను విముక్తం చేయడానికి నాడు ఆంధ్ర ప్రాంత నాయకులు, ప్రజలు తమ ప్రాణాలను, ఆస్తులను పణంగా పెట్టారని  చరిత్ర చాటుతోంది. 

నిజాం నియంతృత్వ పాలన, రజాకార్ల అరాచకాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడంలో.. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనం కావడంలో.. ఆంధ్ర ప్రాంత ప్రజలు, నాయకులు, అక్కడి ప్రభుత్వాలది అత్యంత ప్రముఖమైన, చారిత్రక పాత్ర ఉంది.  ఇది కేవలం ఊహాగానం కాదు, ఇది రికార్డు చేయబడిన చారిత్రక సత్యం. కాబట్టి, తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించడంలో, ఆ తర్వాత 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్‌లో కలవడంలో ఆంధ్ర ప్రాంత సోదరుల త్యాగాలు, వ్యూహాలు- ఆర్థిక, ఆయుధ సహకారం అత్యంత కీలకమైనవనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ.. ప్రముఖ సంపాదకుడు, కేశ్రీనివాస్  సందర్భోచిత వ్యాసం రాసిన సంగతి తెలిసిందే.  నాడు- నేడు తెలంగాణ నిర్మాణంలో ఆంధ్రుల పాత్ర మనం మరవలేనిదని అన్నారాయన.  ఇలా చెబుతూ పోతే, ఆ నాటి నుంచి ఈనాటి వరకూ తెలంగాణ నిర్మాణంలో ఆంధ్రుల పాత్ర మరువలేనిది. ఇవాళొచ్చి ఈ చారిత్రక వాస్తవాలేవీ గుర్తించకుండా.. ఇది మాది, మీరిక్కడి నుంచి వెళ్లిపోండనడం విడ్డూరం. నిజాముల అరాచక పాలన నుంచి తప్పించి.. వారికంటూ ఒక సొంత ప్రాంతం వచ్చేలా చేసింది ఆంధ్రులే. ఆ తర్వాత తాము చెన్నై చెర నుంచి విముక్తి సాధించాక.. భాషా ప్రయుక్త రాష్ట్రాల ద్వారా తిరిగి ఆంధ్రలో కలిసింది తెలంగాణ.

ఆపై తమను కాపాడిన ఆంధ్రుల నుంచి కూడా  విముక్తి కోసం పోరాడి.. ఇవాళ తొలి, మలి ఉద్యమాల్లో సుమారు 15 వందల మంది బలిదానం ద్వారా ఏర్పడిన ఈ రాష్ట్రం ఇంకా ఆంధ్రుల నుంచి.. ఆర్ధిక, సామాజిక- రాజకీయ, మీడియా  అవసరాలను తీర్చుకుంటూనే ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చూపించింది ఆంధ్ర మీడియానే. అప్పటికి కనీసం తెలంగాణ నుంచి చానెళ్లు లేవు. ఒక వేళ ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చినా.. వాటిని కూడా ఆంధ్రులే నడపాలి. కారణం ఇక్కడ తెలంగాణలో గానీ, అక్కడ అమెరికాలోగానే అత్యధిక వర్కింగ్ అవర్స్ ని ఆయా సంస్థలకు త్యాగం చేసేది వీరే కాబట్టి. ఇక్కడ తెలంగాణ వాదులు కావచ్చు, అక్కడ యురోపియన్ వాదులు కావచ్చు.. లక్షల కోట్ల వ్యవస్థల నిర్మాణం తర్వాత దాన్ని చూసి కన్ను కుట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెబుతుంటారంతే. అంటే, అప్పుడూ, ఇప్పుడూ..  ఎప్పుడూ తెలంగాణలో ఆంధ్రుల పాత్ర మరువలేనిది. తీసిపారేయలేనిది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్‌ ఇక్కడకొచ్చి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నవనిర్మాణ సభ ఏర్పాటు చేసే యత్నం చేశారు. ఇదింకా ముందుకు వెళ్తుందనే చెప్పాల్సి ఉంటుంది.  

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...