యాప్ లకు కాలం చెల్లింది.. సత్య నాదేళ్ల

posted on: Jun 3, 2026 10:16AM

సాంకేతిక ప్రపంచంలో త్వరలోనే  ఊహించని భారీ మార్పు రాబోతోంది. మనం ప్రతిరోజూ స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లలో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్‌లు, రకరకాల యాప్‌ల ప్రాధాన్యత  పూర్తిగా తగ్గిపోనుంది. వాటి స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత  ఏఐ ఏజెంట్లు భర్తీ చేయనున్నాయి.  మైక్రోసాఫ్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  బిల్డ్ 2026 కాన్ఫరెన్స్‌లో ఆ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ఈ సంగతి చెప్పారు. ఇకపై మానవులకు, కంప్యూటర్లకు మధ్య ఏఐ ఏజెంట్లే ప్రధాన వారధిగా మారతాయన్నారు. ఈ సరికొత్త సాంకేతిక విప్లవం డిజిటల్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేయబోతోందని చెప్పారు. 

ఈ అద్భుతమైన మార్పు కోసం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే  వేగంగా ముందుకు సాగుతోందన్న సత్య నాదేళ్ల.. ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ భాగస్వామ్యంతో  ప్రాజెక్ట్ సొలారా  అనే సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను మైక్రోసాఫ్ట్ సిద్ధం చేసిందని చెప్పారు. ఇది హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్,  క్లౌడ్ సేవలను ఒకే చోట అనుసంధానిస్తుంది. దీనివల్ల కంప్యూటర్ టెక్నాలజీలో సరికొత్త విప్లవం రానుంది. ఇప్పటివరకు మనం ఏదైనా పని చేయాలంటే దానికి సంబంధించిన ప్రత్యేకమైన యాప్స్ ఓపెన్ చేయాల్సి వచ్చేది. కానీ భవిష్యత్తులో అలాంటి యాప్స్ ఓపెన్ చేసే అవసరం లేకుండా..  నేరుగా ఏఐ ఏజెంట్ల ద్వారానే మన పనులన్నీ క్షణాల్లో పూర్తి చేసుకోవచ్చు.

ప్రస్తుతం మనం ఒక రైలు టికెట్ బుక్ చేయాలన్నా, ఆహారాన్ని ఆర్డర్ చేయాలన్నా,  సమాచారాన్ని వెతకాలన్నా వేర్వేరు యాప్‌లపై ఆధారపడుతున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఏఐ ఏజెంట్లు మన తరఫున ఆయా పనులను  పూర్తి చేస్తాయి. ఇవి కేవలం ఏదో ఒక యాప్‌కే పరిమితం కాకుండా..  వేర్వేరు సాఫ్ట్‌వేర్లు,  డివైజ్‌ల మధ్య అద్భుతమైన సమన్వయం చేసుకుంటూ పనిచేస్తాయి. మనం ఇచ్చే వాయిస్ కమాండ్స్ లేదా చిన్న టెక్స్ట్ మెసేజ్ ఆధారంగా ఇవి క్షణాల్లో స్పందించి,   కావలసిన పనిని సులువుగా ముగించేస్తాయి.

ఈ సరికొత్త ప్లాట్‌ఫామ్‌లో 'జస్ట్ ఇన్ టైమ్ యూఐ' అనే ఒక ప్రత్యేకమైన ఫీచర్‌ను మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. దీనివల్ల సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ప్రతి డివైజ్ కోసం విడివిడిగా యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్ చేయాల్సిన శ్రమ తప్పుతుంది. డివైజ్  స్క్రీన్ సైజు, యూజర్ ఇచ్చే వాయిస్ లేదా టచ్ వంటి ఆప్షన్లకు తగ్గట్లుగా ఏఐ ఏజెంట్లే స్వయంగా స్క్రీన్ డిజైన్‌ను మార్చేస్తాయి. ఈ సాంకేతికత వల్ల భవిష్యత్తులో సరికొత్త గ్యాడ్జెట్ల తయారీ ఖర్చు, వాటిని రూపొందించే శ్రమ డెవలపర్లకు చాలా వరకు తగ్గిపోతుంది.

రాబోయే కాలంలో ప్రపంచం మొత్తం ఒకే ఒక్క ఏఐ అసిస్టెంట్‌తో నడవదని సత్య నాదెళ్ల వివరించారు. వేర్వేరు ప్రత్యేకమైన పనుల కోసం విభిన్న రంగాలకు చెందిన ప్రత్యేక ఏఐ ఏజెంట్లు అందుబాటులోకి వస్తాయన్న ఆయన.. ఈ విభిన్న ఏజెంట్లను కంట్రోల్ చేయడానికి, పర్యవేక్షించడానికి మైక్రోసాఫ్ట్ సరికొత్త టెక్నాలజీని తీసుకువస్తోందని వివరించారు. ఏ పనిని ఏ ఏఐ ఏజెంట్‌కు అప్పగించాలో  ఏజెంట్ టాస్క్ మేనేజర్ స్వయంగా నిర్ణయిస్తుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో తమ సొంత ఏఐ ఏజెంట్లను సులువుగా వాడుకోవడానికి మైక్రోసాఫ్ట్ అవకాశం కల్పిస్తోంది. సాంకేతిక రంగంలో రాబోతున్న ఈ సరికొత్త మార్పు డిజిటల్ యూజర్ల అనుభవాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లనుందనడంలో సందేహం లేదు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...