భూసేకరణలో ఆఖరి ఘట్టం ఈనెల 20 నుండి మొదలు
posted on Aug 14, 2015 8:39PM
.jpg)
ఈనెల 20 నుండి రాజధాని ప్రాంతంలో భూసేకరణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొంది. ఈరోజు విజయవాడలో చంద్రబాబు నాయుడు అధక్షతన సుదీర్గంగా సాగిన సమావేశంలో సీ.ఆర్.డి.ఏ. ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులు, కృష్ణ, గుంటూరు జిల్లా కలెక్టర్లు, కేంద్రమంత్రి సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాజధాని మొదటిదశ నిర్మాణం, నిధుల సమీకరణ వగైరా అంశాల గురించి సమావేశంలో చర్చించిన తరువాత ఈ నెల 20 నుండి భూసేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించారు.
ఈలోగా అధికారులు, ప్రజా ప్రతినిధులు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతులను మరొకమారు కలిసి ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించి వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తారు. అప్పటికీ అంగీకరించకపోతే ఇక 20 నుండి భూసేకరణ చట్ట ప్రకారం రైతులకు నోటీసులు ఇచ్చి భూసేకరణ కార్యక్రమాన్ని మొదలుపెడతారు. రాజధాని నిర్మాణానికి సమయం దగ్గిర పడుతున్నందున భూసేకరణకు ఇకపై పొడిగింపులు ఇచ్చే అవకాశం లేదనే భావించవచ్చును.
అందరి కంటే ముందు పవన్ కళ్యాణ్ ఈ భూసేకరణను వ్యతిరేకించారు కనుక ఆయన ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి దిగుతారో లేదో చూడాలి. కాంగ్రెస్, వైకాపా, వామపక్షాలు ప్రత్యేక హోదాపై తాము చేస్తున్న పోరాటాలని పక్కనబెట్టి మళ్ళీ భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెడతాయేమో? ప్రభుత్వం మొదలుపెట్టిన భూసమీకరణలో ఈ ఆఖరి ఘట్టంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులు, ప్రతిపక్షాలు, పవన్ కళ్యాణ్ తదితరులందరినీ ఒకేసారి ఎదుర్కొని పోరాడవలసిరావచ్చును. అంతే కాదు న్యాయపోరాటాలు కూడా తప్పకపోవచ్చును. ఈ అవరోధాలన్నిటినీ అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ముందుకు సాగుతుందో చూడాల్సిందే.