Latest News

అఖిలపక్ష సమావేశం మంచిదే కదా

posted on: Sep 3, 2014 4:28PM

 

ఇంతవరకు రాజధాని విషయంపై వ్యూహాత్మకంగా మౌనం పాటించిన వైకాపా ఇప్పుడు తెదేపా ప్రభుత్వం విజయవాడ-గుంటూరు వద్ద రాజధాని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకొన్న తరువాత అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టింది. అభివృద్ధి చెందిన ప్రాంతంలో రాజధాని నిర్మించడం కంటే, వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో నిర్మిస్తే ఆ ప్రాంతం కూడా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని వైకాపా వాదన. అదేవిధంగా రాజధాని ఏర్పాటుపై శివరామ కృష్ణన్ కమిటీ సమర్పించిన నివేదికను కూడా బహిర్గతం చేయమని ప్రతిపక్షాలు గట్టిగా కోరుతున్నాయి. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి లోతుగా చర్చించి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొన్న తరువాతనే ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని కోరుతోంది. అసెంబ్లీలోకి అడుగుపెట్టలేని కారణంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతోంది.

 

రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన విషయం కనుక కాంగ్రెస్, వైకాపాల సూచనలను తప్పుపట్టలేము. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పనిని మొదటే చేసి ఉండి ఉంటే చాలా హుందాగా ఉండేది. ఇప్పటికయినా మించి పోయింది ఏమీ లేదు కనుక ప్రభుత్వం ఒకసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్లయితే ప్రతిపక్ష పార్టీలను గౌరవించినట్లు ఉంటుంది. వారి నుండి ప్రభుత్వానికి ఇంకా ఏదయినా మంచి సలహా దొరికినా దొరకవచ్చును. పైగా వారిని సంప్రదించి నిర్ణయం తీసుకొంటున్నందున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక ఎవరూ నిందించే అవకాశం ఉండదు. ఒకవేళ అందరూ కలిసి కూర్చొని చర్చించిన తరువాత ఈ అంశంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేసినట్లయితే ప్రజల దృష్టిలో అవే పలుచనవుతాయి. కానీ ప్రభుత్వం రాజధానిపై ఒక నిర్ణయం ప్రకటించిన తరువాత, ఇక ఆ తరువాత వచ్చే సమస్యలన్నిటికీ రాష్ట్రప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయం కూడా గుర్తుంచుకోవాలి.

 

కర్నూలు రాజధానిని చేయమని కోరుతున్న రాయలసీమ ప్రజలు విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటు చేసినట్లయితే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడమే కాకుండా అప్పుడే రెండు మూడు సార్లు కర్నూలులో ధర్నాలు, ర్యాలీలు బహిరంగ సభలు, బందులు నిర్వహించారు. అందువలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు శాసనసభలో తన నిర్ణయం ప్రకటించేసిన తరువాత ఎదురవ్వబోయే ఇటువంటి సమస్యలతో ప్రతిపక్షాలకు ఎటువంటి సంబందమూ ఉండదు కనుక అవి కూడా రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించవచ్చును. అందువలన ప్రభుత్వం ప్రతిపక్షాలతో కూడా ఈ అంశంపై చర్చించడమే అన్ని విధాల ఉత్తమం. అయితే ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఈ అంశంపై రాజకీయాలు చేయకుండా నిజాయితీగా వ్యవహరిస్తే అందరూ హర్షిస్తారు. కానీ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సున్నితమయిన ఈ అంశంపై రాజకీయాలు చేస్తే ప్రజల దృష్టిలో మరింత పలుచనవడం ఖాయం.

google-ad-img
    Related Sigment News
    • Loading...