ఓడినా మేమే గెలిచాము: రఘువీర రెడ్డి

posted on: Sep 17, 2014 12:38PM

 

అధికార తెలుగు దేశం ప్రభుత్వానికి బుద్ధి చెపుతామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ నందిగామ ఉపఎన్నికల బరిలో దూకిన కాంగ్రెస్ పార్టీ అదే అధికారపార్టీ చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కానీ చింత చచ్చినా పులుపు చావనట్లు, ఓడిపోయినా తమ పార్టీకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదం. తాము ఎన్నికలలో పైసా ఖర్చు పెట్టకపోయినా సుమారు పాతికవేలు ఓట్లు గెలవడం తెదేపా పరిపాలన పట్ల ప్రజల అసంతృప్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చని ఆయన కొత్త విషయం కనిపెట్టి చెప్పారు.

 

కానీ 'అశ్వత్థామ హతః కుంజరహః' అన్నట్లుగా ఆయన అసలు విషయం మాత్రం చెప్పనే లేదు. తెదేపా శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకర్ రావు ఆకస్మిక మృతి కారణంగా వచ్చిన ఈ ఉపఎన్నికలలో తెదేపా ఆయన కుమార్తె సౌమ్యను తన అభ్యర్ధిగా నిలబెడుతున్న కారణంగా వైకాపా తన అభ్యర్ధిని నిలబెట్టలేదు. అందుకే వైకాపా ఖాతాలోపడవలసిన ఓట్లు, కాంగ్రెస్ ఖాతాలో జామా అయ్యాయి. ఒకవేళ వైకాపా కూడా ఈ ఉప ఎన్నికలలో పాల్గొని ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ అయినా దక్కేది కాదని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అయినా రఘువీరా రెడ్డి ఈ సంగతి ప్రస్తావించకుండా వాపును చూసి బలుపని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాని వలన ఆయనకు, కాంగ్రెస్ పార్టీకే నష్టం కలుగుతుంది తప్పఅధికార తెదేపాకు కానీ ప్రజలకు గానీ ఎటువంటి నష్టమూ లేదు. ఇటువంటి వాదనలు ఆయన తన అధిష్టానానికి సర్ది చెప్పుకోవడానికి పనికివస్తాయి తప్ప ప్రజలకు నచ్చజెప్పడానికి పనికి రావని దని గ్రహిస్తే మేలు. అయినా ఆయన ఇటువంటి భ్రమల్లో బ్రతకాలనుకొంటే ఎవరు మాత్రం కాదంటారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...