Latest News

పిల్లలకు డీఎన్ఏ టెస్ట్ చేయాలన్న తండ్రి పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు

posted on: Mar 21, 2026 7:07PM

 

భార్యపై ఉన్న వివాహేతర సంబంధం ఆరోపణలను నిరూపించడానికి అమాయకపు పిల్లలను పావులుగా వాడుకోలేరని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. భార్య ప్రవర్తనపై అనుమానంతో పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. పిల్లల గౌరవం, వారి గోప్యత మరియు సామాజిక భద్రత తల్లిదండ్రుల మధ్య జరిగే వివాదాల కంటే ముఖ్యమని కోర్టు ఉద్ఘాటించింది.

నేపథ్యం మరియు కోర్టు విచారణ

విజయనగరం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందనే  కారణంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. అయితే, విచారణ సమయంలో తన ఇద్దరు పిల్లలు తనకు పుట్టలేదని, తన భార్యకు వేరొకరితో ఉన్న సంబంధం వల్ల వారు జన్మించారని అతను ఆరోపించాడు. దీనిని నిరూపించడానికి పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు జరపాలని కింది కోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్‌ను జిల్లా కోర్టు తిరస్కరించడంతో, అతను హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశాడు.

ఈ కేసును విచారించిన జస్టిస్ తర్లాడ రాజశేఖర రావు, భర్త చేసిన విన్నపాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. భార్య వ్యభిచారానికి పాల్పడుతోందని నిరూపించడానికి పిల్లల జన్మరహస్యాన్ని రచ్చకీడ్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. పిల్లలు ఈ వివాదంలో భాగస్వాములు కానప్పుడు, వారిని సాక్ష్యాలుగా మార్చడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

పిల్లల హక్కులే ప్రధానం

సెక్షన్ 112 (భారత సాక్ష్య చట్టం) ప్రకారం, వివాహ బంధంలో ఉన్నప్పుడు జన్మించిన పిల్లలు చట్టబద్ధమైన సంతానంగానే పరిగణించబడతారని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఒకవేళ భార్యకు వివాహేతర సంబంధం ఉందని నిరూపించాలనుకుంటే, భర్త ఇతర సాక్ష్యాధారాలను సేకరించుకోవాలి తప్ప, పిల్లల డీఎన్ఏను అడగకూడదని స్పష్టం చేశారు."తల్లిదండ్రుల మధ్య ఉండే మనస్పర్థల వల్ల పిల్లలపై 'అక్రమ సంతానం' అనే ముద్ర పడకూడదు. ఇది వారి మానసిక స్థితిపై, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది," అని కోర్టు వ్యాఖ్యానించింది.

భారీ జరిమానా విధింపు

కేవలం అనుమానంతో పిల్లల హక్కులను కాలరాసేలా పిటిషన్ వేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, పిటిషనర్‌కు 3,000 రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే సివిల్ రికవరీ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ, డీఎన్ఏ పరీక్షలు అనేవి అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే వాడాలని, కేవలం విడాకుల కేసుల్లో సాక్ష్యం కోసం వీటిని అనుమతించలేమని ఏపీ హైకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...