శ్రీవారి పరకామణి కేసు...సీఐడీ దర్యాప్తుకు కోర్టు ఆదేశాలు
posted on Oct 27, 2025 6:58PM

తిరుమల శ్రీవారి పరకామణి వ్యవహారంపై సీఐడీతో దర్యాప్తు చేపట్టాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు, కేసు దర్యాప్తు తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పరకామణిలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని కోర్టు ప్రశ్నించింది. టీటీడీ ఈఓ, సీబీఎస్ఓలను హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
అలాగే నిందితుడు రవికుమార్‌పై ఏసీబీ దర్యాప్తు జరపాలని పేర్కొన్నాది. రవి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సేకరించి, నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలంటూ ఆదేశించింది. ఇదిలా ఉండగా, పరకామణి అక్రమాలపై ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన సాధు పరిషత్ సభ్యుడికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
ఇక పరకామణి చోరీ కేసును కూటమి సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రవికుమార్ పరకామణి నుంచి పలు విడతలుగా నగదు దోచుకున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో బయటపడింది. ఈ ఘటనపై 2023లో కేసు నమోదైంది. టీటీడీ విజిలెన్స్ విచారణలో రవికుమార్ దాదాపు రూ.100 కోట్ల సొమ్మును కొల్లగొట్టినట్లు తేలింది. అయితే, ఆ సమయంలో టీటీడీ అధికారులు సరైన దర్యాప్తు చేయకుండానే లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.