నాయకులకే నమ్మకం లేని ఏపీ వైద్యం..హైదరాబాద్‌కి పరుగుల వెనుక నిజాలేంటి..?

posted on: Jul 27, 2026 4:22PM

 

చిన్న జ్వరం వచ్చినా, భుజం నొప్పి పెట్టినా, ఆఖరికి పన్ను బిగించుకోవాలన్నా.. ఏపీ నాయకులు వెంటనే హైదరాబాద్ విమానమెక్కుతారు లేదా కార్పొరేట్ ఆసుపత్రుల బాట పడతారు. కానీ, అదే రాష్ట్రంలో రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యుడికి అనారోగ్యం వస్తే? సొంత ఆస్తులు అమ్ముకుని, ఊళ్లలో అప్పులు చేసి, చేతిలో ఉన్న పైసలన్నీ పక్క రాష్ట్రంలోని ఆసుపత్రులకు ధారపోస్తూ అంపశయ్యపై కొట్టుమిట్టాడుతున్నారు. పాలించే పాలకులకే తమ రాష్ట్ర వైద్య విధానంపై నమ్మకం లేనప్పుడు, నమ్మి ఓటేసిన జనం ఏమైపోవాలి? ఇది కేవలం రాజకీయాల ప్రశ్న కాదు.. లక్షలాది మంది సామాన్య కుటుంబాల జీవిత మరణాల సమస్య. ఈ అంశంపై  టోన్‌ న్యూస్‌లో ఆసక్తికర చర్చ నిర్వహించారు.

పాలకుల పరుగు.. పేదల బలిపశువులువిభజన తర్వాత స్వంత రాష్ట్రాన్ని కట్టుకుంటామని గొప్పగా చెప్పిన నాయకులు, కనీసం ఒక అత్యుత్తమ ప్రభుత్వాసుపత్రిని, పరిశోధనా కేంద్రాన్ని ఎందుకు తీర్చిదిద్దలేకపోయారు? గుంటూరు, విశాఖ, కర్నూలు, తిరుపతి వంటి చారిత్రాత్మక మెడికల్ కాలేజీల నుంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్లు తయారయ్యారు. మంగళగిరిలో ఎయిమ్స్ (AIIMS) వంటి ఉన్నత వైద్య సంస్థ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ చిన్నపాటి ఆరోగ్య సమస్య రాగానే సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. పాలకులే కార్పొరేట్ దవాఖానాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతుంటే, సామాన్య ప్రజలలో తీవ్రమైన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. "నాయకులే ఏపీలో చికిత్స చేయించుకోవడం లేదంటే, ఇక్కడ డాక్టర్లు సరిగా లేరా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన మిషన్లు లేవా?" అనే అనుమానంతో మధ్యతరగతి, పేద ప్రజలు తమ సర్వస్వాన్ని అమ్ముకుని హైదరాబాద్‌కి పరుగులు తీస్తున్నారు.

నలిగిపోతున్న సంసారాలు.. అప్పుల ఊబిలో సామాన్యుడుకోవిడ్ కాలం నుండి నేటి వరకు ఏపీ నుంచి వేల కోట్ల రూపాయలు పక్క రాష్ట్రపు కార్పొరేట్ హాస్పిటళ్లకు తరలిపోతున్నాయి. ప్రభుత్వ దవాఖానాల్లో ఎక్స్‌రే, సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ (MRI) వంటి ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఆరోగ్యశ్రీ పేరు చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడంపై ఉన్న శ్రద్ధ, సొంత రాష్ట్రాన్ని 'మెడికల్ హబ్'గా మార్చడంపై పాలకులకు లేకుండా పోయింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఏపీలోని పేద కుటుంబాలు అనుభవిస్తున్న నరకం వర్ణనాతీతం. ఇంట్లో ఒక్కరికి పెద్ద జబ్బు చేస్తే చాలు.. పొలాలు అమ్ముకోవాల్సి వస్తోంది, ఆడాళ్ల పుస్తెల తాళ్లు కుదవబెట్టాల్సి వస్తోంది. హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల బిల్లులు కట్టలేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పాలకుల బాధ్యతారాహిత్యం వల్ల సామాన్యుడి ప్రాణాలకు, ఆరోగ్యానికి ఏమాత్రం రక్షణ లేని పరిస్థితి దాపురించింది.

కావాల్సింది ప్రచారాలు కావు.. ఆత్మపరిశీలన.. కోట్ల రూపాయల అప్పులు తెచ్చి, పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్మును నాణ్యమైన ప్రజా వైద్యం కోసం ఎందుకు ఖర్చు చేయడం లేదు? ప్రైవేటు విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులకు పదవులు కట్టబెట్టడంపై ఉన్న ధ్యాస, ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేయడంపై ఏ నాయకుడికీ లేదు. నాయకులకు కాస్తయినా ఇంగితజ్ఞానం, సామాజిక బాధ్యత ఉంటే.. ముందుగా తమ సొంత రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించాలి. పాలకులు ఇక్కడే చికిత్స పొంది భరోసా ఇచ్చినప్పుడే, సామాన్యుడు ధైర్యంగా జీవించగలడు. ఏపీ ప్రజా ఆరోగ్యం నామరూపాలు లేకుండా పోకముందే, పాలకుల తీరు మారాలి. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.

 

 

AP Healthcare System, AP Ministers Hyderabad Treatment, AIIMS Mangalagiri, AP Government Hospitals, Tone News,  AP Health Report, AP Political News Telugu, Sunkara Venkateswara Rao Analysis, AP Health Infrastructure, Arogyasri Scheme AP

google-ad-img
    Related Sigment News
    • Loading...