ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వేదికగా ఏపీ ఏడు ఒప్పందాలు!
posted on: Feb 20, 2026 4:54PM
.webp)
ఢిల్లీలోని భారత మండపం వేదికగా ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో ఏపీ సర్కార్ ఈ ఒప్పందాలు చేసుకుంది. ఏపీలో క్వాంటం-ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ఈ ఒప్పందాలు దోహదం చేస్తాయంటున్నారు. ఏపీని క్వాంటం-ఏఐ హబ్ గా తీర్చిదిద్దడం అమరావతిలోని క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తేవడానికి, ఏపీలో ఏఐ-క్వాంటం ఎకో సిస్టం పెంపొందించడానికి బాటలు వేసేలా ఈ ఒప్పందాలు చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఆ ఒప్పందాల వివరాలు ఇలా ఉన్నాయి.
క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (యూఎన్ఐసీసీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఏఐ క్వాంటం ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఎంఓయు చేసుకుంది. ఏఐ-క్వాంటం డిజిటిల్ ఎంబసీగా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను తీర్చిదిద్దేందుకు ఈ ఎంఒయూ దోహదం చేస్తుంది.
అలాగే, క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో రాష్ట్రంలోని లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఐబీఎంతో ఒప్పందం చేసుకుంది. ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ ఫాం ద్వారా ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం అంగీకరించింది. భారత్ లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్ వర్క్ ఫోర్సును సిద్ధం చేసుకునే లక్ష్యాల్లో భాగంగా ఐబీఎం శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించింది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (ఎన్ఐఈఎల్ఐటీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ భారతదేశంలో మొట్ట మొదటి ఏఐ, క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేసేలా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం అవసరమయ్యే మౌలిక సదుపాయాలకు కేంద్రం నిధులు పమకూరుస్తుంది. ఇక ఇందుకు అవసరమయ్యే భూమి, క్వాంటం హార్డ్‌వేర్ ను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేలా ఈ ఒప్పందం కుదిరింది.
అదే విధంగా రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్-5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా భారత్ జెన్-నెక్స్ జెన్-ఐబీఎంతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వంలోని వివిధ సంస్థలకు సేవలందించడంతో పాటు 22 భారతీయ భాషలను అనుసంధానించేలా ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తారు.
ఇక పోతే ఏపీలోని 50 ఉన్నతవిద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటం టెక్నాలజీని బలోపేతం చేసేలా ఏఐ అకాడెమీ, ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు కాలిబో ఏఐ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులలో టెక్నాలజీపై అవగాహన కల్పించడం, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కోసం ఏఐ శాండ్ బాక్స్-ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు, ఏఐ ఇంటిగ్రేటెడ్ కరిక్యులమ్, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై ఫోకస్ పెట్టేలా కాలిబో సంస్థతో ఈ ఓప్పందం కుదిరింది.
కాగా అమరావతి క్వాంటం వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేలా వైజర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి 3.50 లక్షల మంది ఏఐ-క్వాంటం లెర్నర్లు, 2027 నాటికి 6 లక్షల మందిని సిద్ధం చేస్తారు. ఇక ఏడో ఒప్పందం రాష్ట్రంలో ఏఐ ట్యూటర్ ఏర్పాటు కోసం ఐఐటీ మద్రాస్ తో చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.






