ప్రభుత్వ సలహాదారులుగా కార్టూనిస్టు శ్రీధర్, మంతెన సత్యనారాయణ రాజు
posted on: Feb 21, 2026 1:58PM

ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్ గా తెలుగు పాఠకులకు తన కార్టూన్ల ద్వారా చిరపరిచితుడైన పోచంపల్లి శ్రీధర్ రావును, ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజులను ప్రభుత్వ సలహాదారులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. శ్రీధర్ నుసమాచార ప్రచార విభాగం సలహాదారుగా, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ప్రకృతి వైద్యం విభాగం సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు జారీ చేశారు. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవులలో వారిరువురూ రెండేళ్ల పాటు కొనసాగుతారు. రాజకీయ, సామాజిక అంశాలపై తన కార్టూన్లతో శ్రీధర్ ప్రజాభిమానాన్ని చూరగొన్న కార్టూనిస్ట్ శ్రీధర్ ను ప్రభుత్వం సమాచార ప్రచార విభాగం సలహాదారుగా నియమించి గౌరవించింది.
అలాగే ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా గుర్తింపు పొందారు. సహజ, సేంద్రీయ ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై టీవీ ప్రోగ్రామ్‌ల ద్వారా, సోషల్ మీడియాలో వీడియోల ద్వారా సత్యనారాయణ రాజు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సాలయం పేరుతో ఆసుపత్రిని నిర్వహి స్తున్నారు. విజయవాడ, నరసాపురంలో కూడా సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం కేంద్రా లున్నాయి.






