తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం

 

మొంథా తుఫాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.1000 అందజేయాలని నిర్ణయించింది. కుటుంబంలో ముగ్గురికి కంటే ఎక్కువ ఉంటే గరిష్ఠంగా రూ.3000 అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇళ్లకు వెళ్లే ముందు ఈ నగదు ఇవ్వనున్నారు. మొంథా సైక్లోన్ స్పెషల్ స్కేల్ ఆఫ్ అసిస్టెన్స్‌గా ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. తుపాను బాధిత మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేకంగా 50 కిలోల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం శాఖల వారీగా బాధ్యతలను అప్పగించింది. నిత్యావసర సరుకులు బియ్యం, కందిపప్పు, వంట నూనె, చక్కెర వంటి సరకుల సరఫరాను వెంటనే ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. అదేవిధంగా, ఉల్లిపాయలు, బంగాళాదుంపలతో పాటు ఇతర కూరగాయల సేకరణ, పంపిణీ బాధ్యతలను మార్కెటింగ్ శాఖ కమిషనర్‌కు అప్పగించింది. క్షేత్రస్థాయిలో బాధితులకు సకాలంలో సాయం అందేలా చూడాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 

తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. తుఫాన్ కారణంగా ఎడితెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ధాటికి వాగులు, కాలువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలతో పాటు బలమైన గాలులు వీయడంతో చెట్లు, కరెంట్ స్తంభాలు నెలకొరిగాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ముందస్తు చర్యల్లో భాగంగా.. తుఫాన్ ముప్పు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu