ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు ఫిక్స్!
posted on Mar 6, 2020 9:20AM

కనిష్ఠం రూ.35 వేలు
288లో 150 కాలేజీలకు ఖరారు
మిగతావాటిపైనా నేడు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజ్‌ల ట్యూషన్ ఫీజు ఖరారు చేశారు. 2019-20 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల బ్లాక్ పీరియడ్‌కు మొత్తం 288 ఇంజనీరింగ్ కాలేజీలకు ట్యూషన్ ఫీజు ఖరారు కావాల్సి ఉంది. గురువారం ప్రత్యేకంగా సమావేశమైన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్... ఇందులో దాదాపు 150 కాలేజీల ఫీజులను తేల్చింది.
కనీస ఫీజు రూ.35 వేలుగా నిర్ణయించారు. అయితే కొన్ని కాలేజీల విషయంలో పున:సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ సభ్యులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఆడిటర్ రిపోర్టును బట్టి చూస్తే పలు కాలేజీలకు ఫీజును గతంలో కంటే తగ్గించాల్సి ఉందన్న భావన ఈ సమావేశంలో వ్యక్తమయినట్టు చెబుతున్నారు.
ఉన్నత విద్య నియంతణ్ర, పర్యవేక్షణ కమిషన్ బృందాలు గత నవంబర్ 27 నుంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. జనవరి నెలాఖరుకల్లా ఈ ప్రక్రియను పూర్తిచేశాయి. ఫిబ్రవరి 4 నుంచి కాలేజీలతో వ్యక్తిగత విచారణ మొదలుపెట్టి మార్చి 3తో ముగించాయి. కాలేజీలు సమర్పించిన ఫీజుల ప్రతిపాదనలు, తనిఖీల నివేదికలు, వ్యక్తిగత విచారణ అనంతరం..గురువారం కమి షన్ సమావేశమైంది.
పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని కాలేజీల పనితీరును బట్టి వాస్తవంగా ఎంతవస్తే అంతే సిఫారసు చేద్దామని పలువురు సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజుల ఖరారులో విద్యాబోధన , సదుపాయాలు, ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్లు, ఆదాయ, వ్యయాలు, ఏఐసీటీఈ నిబంధనల అమలు తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకున్నారు.
కన్వీనర్ కోటా ఫీజుకు దాదాపు డబుల్ ఫీజును కేటగిరీ-బి అడ్మిషన్లలో వసూలు చేసుకునేలా సిఫారసు చేయాలని కమిషన్ నిర్ణయించింది.
పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆర్థికభారం తగ్గించుకునే ఆలోచనతోనే ఫీజులు తగ్గిస్తున్నారని కాలేజీల మేనేజ్‌మెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.