"విజయ" ఎవరిది..?

posted on: Aug 8, 2016 5:11PM

ఏ మాత్రం "బుర్ర" లేకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన తెలుగుజాతి ఇప్పుడు ప్రతి చిన్న దానికి కొట్టుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య "కృష్ణా జలాల పంపకం" రగడగా మారింది. తాజాగా ప్రైవేట్ డెయిరీలకు ఎదురొడ్డి తన ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రభుత్వరంగ పాల ఉత్పత్తుల సంస్థ ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ సహకార సంస్థ ఉత్పత్తి చేస్తోన్న "విజయ" బ్రాండ్ పాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం చోటు చేసుకుంది. తెలుగు నేలపై క్షీర విప్లవాన్ని తీసుకొచ్చిన సంస్థ "ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ". ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ డెయిరీ "విజయ" పేరుతో పాలను విక్రయించేది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ డెయిరీని 9వ షెడ్యూల్‌లో చేర్చారు. దీని విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.

 

అయితే తెలంగాణ ప్రభుత్వం విడిగా పాడి సమాఖ్యను ఏర్పాటు చేసుకుంది. అయితే బ్రాండ్ పేరులో మార్పు లేకుండా "విజయ" పేరు కొనసాగిస్తూ ప్యాకెట్‌కు తెలంగాణ ట్యాగ్ తగిలించి విక్రయిస్తోంది. అటు ఏపీ డెయిరీ, ఇటు తెలంగాణ డెయిరీలు ఒకే బ్రాండ్ పేరుతో పాల విక్రయాలు చేస్తున్నాయి. మరో వైపు ఏపీ డెయిరీ కూడా కోస్తా, రాయలసీమల్లో సేకరించిన పాలను తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న "సాంబశివ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీ"లో ప్రాసెస్ చేసి ఆ పాలను విజయ పేరుతోనే అమ్ముతోంది. ఈ క్రమంలో సాంబశివ డెయిరీ నుంచి విజయ బ్రాండ్ పేరుతో కొందరు ప్రజలకు నకిలీ పాలు సరఫరా చేస్తున్నారని విజయ డెయిరీ ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీసాంబశివ డెయిరీ ప్రోడక్ట్స్ సంస్థ సేకరించిన పాలను అచ్చం విజయ బ్రాండ్ డిజైన్‌లో ముద్రించి ఉన్న నకిలీప్యాకెట్లలో నింపి మార్కెట్‌లో అక్రమంగా విక్రయిస్తున్నారనీ, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

 

తెలంగాణకు కౌంటర్‌గా ఏపీ డెయిరీ రంగంలోకి దిగింది. సాంబశివ డెయిరీ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సరఫరా అవుతున్న విజయపాలు నకిలీవి కావని..ఏపీ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ జి.మురళీ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ పాలలో ఎలాంటి కల్తీ జరగలేదని పేర్కొన్నారు. దీంతో ఇరు సమాఖ్యలు విజయ బ్రాండ్ తమదంటే తమదంటూ వాదులాడుకుంటున్నాయి. దీంతో వివాదం కోర్టు మెట్లెక్కేంది...ఇరు సమాఖ్యలు కోర్టులో విడివిడిగా పిటిషన్లు వేశాయి.  తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ దుర్గా ప్రసాదరావులతో కూడిన బెంచ్ దీనిపై విచారణ జరిపింది.

 

తెలంగాణ ప్రభుత్వం చట్టాన్ని ఏ మాత్రం గౌరవించకుండా, ఏకపక్షంగా ఏపీ డెయిరీ పేరు మార్చడంతో పాటు ఆస్తులను స్వాధీనం చేసుకుంది అని ఏపీ అడ్వకేట్ జనరల్ రమేశ్ దమ్మాలపాటి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి..తెలంగాణలో విజయపాల అమ్మకాలపై ఏపీ డెయిరీ మోకాలడ్డుతోందన్నారు. అయితే కార్పోరేషన్‌ను కేంద్రప్రభుత్వం విభజించనందున విజయ బ్రాండ్‌ను వాడుకునే హక్కు తమకుందని ఏపీ ఏజీ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఒకవైపు కోర్టులో ఈ వ్యవహారం నడుస్తుండగానే ఈ పంచాయతీ కేంద్రం వద్దకు చేరింది. ఈ నెల 15న ఢిల్లీకి రావాలని ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో విజయ ఎవరిదా అనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...