చిగురుటాకులా వణుకుతున్న కోస్తా తీరం
posted on Oct 28, 2025 10:27AM

మొంథా తుపాను ప్రభావంతో కోస్తా తీరం చిగురుటాకులా వణుకుతోంది. సముద్రంలో అలలు అలలు ఎగసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాల ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. అలల తాకిడికి ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉప్పాడ తీరం కోతకు గురవుతోంది.
ఇప్పటికే అక్కడ దెబ్బతిన్న కొన్ని గృహాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి.మొంథా తుఫాన్ తీవ్ర తుఫాన్ గా బలపడింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుఫాన్ కారణంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మొంథా తుఫాన్ కారణంగా మంగళవారం విజయవాడ, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. అలాగే రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది.
మొంథా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోస్తా జిల్లాల్లోని 26 తీర ప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా తుఫాన్ హెచ్చరికలను రియల్ టైమ్ వాయిస్ అలర్టుల రూపంలో అందిస్తోంది. పెనుగాలులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా 360 డిగ్రీల హార్న్ స్పీకర్ వ్యవస్థ కిలోమీటరు పరిధిలో హెచ్చరికలు అందిస్తుంది. ప్రజలను సందేశాలు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్స్, టాంటాంలు, క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారానూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. పెను తుపాను కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకూడదన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది.