పవన్ కళ్యాణ్ ప్రశ్నలకి ముఖ్యమంత్రి చంద్రబాబు ధీటుగా సమాధానం

 

తుళ్ళూరు రాజధాని గ్రామాలలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్, రైతుల అభీష్టానికి విరుద్దంగా ప్రభుత్వం భూసేకరణ చేయవద్దని, అవసరమయితే తను వారి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్దమని ప్రకటించారు. దీనిని మీడియా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చి దానిపై స్పందించవలసిందిగా కోరగా ఆయన ఈ విధంగా అన్నారు.

 

“రాజకీయ పార్టీలకు ప్రత్యేక ఎజెండాలుండవచ్చును. గానీ దూరదృష్టి కూడా ఉండాలి. అందునా ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీకి మరింత దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. భూసేకరణ విషయంలో మేము అన్ని విషయాలను చాలా లోతుగా అధ్యయనం చేసి ఆలోచించిన తరువాతనే రాష్ట్ర ప్రజలకు ఏది మంచిదో అదే చేస్తున్నాము. రాజధాని అంటే నాలుగు ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే కాదు. అదే అయితే ఒక ఐదు, పదెకరాల స్థలంలో కూడా కట్టుకోవచ్చును. అదీ కుదరదనుకొంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకొని అందులోను పెట్టుకోవచ్చును. కానీ అది రాజధాని అనిపించుకోదు. అటువంటి రాజధాని వలన రాష్ట్రానికి, ప్రజలకి చివరికి తుళ్ళూరు ప్రజలకి కూడా ఎటువంటి ప్రయోజనం చేకూరదు. మేము ప్రజలందరికీ, తుళ్ళూరు రైతులకి, భావితరాలకి కూడా ఉపయోగపడేవిధంగా ఒక గొప్ప ప్రజా రాజధానిని నిర్మించాలనుకొంటున్నాము."

 

"మా ఆశయం మంచిది గనుక రైతులు కూడా దానిని గుర్తించి ప్రభుత్వానికి తమ భూములను ఇచ్చి తోడ్పడ్డారు. ప్రపంచంలో మరెక్కడా కనీవినీ ఎరుగని విధంగా మన రైతులు ఏకంగా 32, 000ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించి అందులో రాజధాని నిర్మాణం చేయమని కోరారు. మేము రైతులను కన్నీళ్లు పెట్టించి తీసుకోలేదు. వారే స్వయంగా ముందుకు వచ్చి తమ భూములను ప్రభుత్వానికి ఇస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా వారికి మంచి భవిష్యత్ కల్పించే బాధ్యత నేను తీసుకొంటున్నాను."

 

"నిజమే! కొంత మంది రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అలాగని వారికి రాజధాని అవసరం లేదా? అంటే వారు కూడా రాజధాని తుళ్ళూరులోనే పెట్టమని అడుగుతారు. కానీ దాని కోసం తమ భూములు మాత్రం ఇవ్వబోరు. చుట్టుపక్కల గ్రామాల రైతులు అందరూ త్యాగాలు చేసి అక్కడ రాజధాని నిర్మించబడితే, ఆ కొందరు రైతులు మాత్రం తమ భూములను అట్టేపెట్టుకొని, మిగిలిన గ్రామాల రైతులు చేసిన ఆ త్యాగాలకు ఫలితాలు పొందాలని ఆశిస్తున్నారు. ఇది న్యాయమేనా? కొందరికి ఒక న్యాయం మరి కొందరికి ఒక న్యాయం మంచి పద్ధతేనా?"

 

"వ్యక్తులు, రాజకీయ పార్టీలు తమ వ్యక్తిగత ఎజెండాలకు, రాజకీయ లబ్ధికి అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆలోచించాలి. మా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందుకు తగిన నిర్ణయాలు తీసుకొంటూ ముందుకు సాగుతోంది. మా ప్రయాత్నాలలో ఇప్పటికే అనేక అవరోధాలు ఎదురయ్యాయి. వాటినన్నీ దాటుకొని ముందుకు సాగాగలుగుతున్నాము అంటే రైతులు, ప్రజలు మాకు అండగా ఉన్నందునే. రాజకీయ పార్టీలదేముంది...తమ కార్యాలయాలకయితే కనీసం పదెకరాల స్థలం కావాలంటాయి, కానీ రాజధానికి మాత్రం వందో వెయ్యో ఎకరాలలో కట్టుకోమని ఉచిత సలహాలు ఇస్తుంటాయి. మేము అటువంటి వారి విమర్శలను, సృష్టించే అవరోధాలను చూసి భయపడి వెనక్కు తగ్గబోము."

 

"నాకివన్నీ అక్కరలేదు అనుకొంటే ఓ ఐదేళ్ళు పరిపాలన చేసుకొని దిగివెళ్లిపోవచ్చును. కానీ రాష్ట్రానికి, ప్రజలకు ఏదో మేలు చేయాలనే దృడ సంకల్పం ఉండబట్టే ఇంత తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో కూడా నిబ్బరంగా అడుగులు వేస్తూ ముందుకే సాగిపోతున్నాను. నా ఆలోచనలను, రాష్ట్ర ప్రజల కోసం నేను కంటున్నా కలలను అన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులు, రైతులు కూడా సహృదయంతో అర్ధం చేసుకొని సహకరించవలసిందిగా మరో మారు అందరినీ వినమ్రంగా కోరుతున్నాను,” అని అన్నారు.