ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రుల మధ్య ఎంత వ్యత్యాసమో?
posted on: Nov 10, 2014 2:35PM
.jpg)
ఈరోజు జరుగుతున్న కొన్ని ఆసక్తికరమయిన పరిణామాలు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ల ఆలోచన తీరులో ఎంత వ్యత్యాసం ఉందో స్పష్టంగా అర్ధమవుతుంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఇంతవరకు కూడా కేసీఆర్ ఆంధ్రప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి చంద్రబాబుపై కత్తులు నూరూతూనే ఉన్నారు తప్ప ఎన్నడూ కూర్చొని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భావించలేదు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చును. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేతగా సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవలసి ఉంటుందనే సంగతిని విస్మరించి, ఆయన నిత్యం కయ్యానికే కాలుదువ్వుతున్నారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొందామని చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు సూచించినప్పటికీ కోర్టుల్లోనే పరిష్కరించుకొందామనుకొంటున్నారు. అనుకోవడమే కాదు ఇప్పటికే అనేక సార్లు కోర్టులకెక్కారు కూడా. ఈసారి కృష్ణానదీ బోర్డుని ఆయన కోర్టుకు ఈడ్చారు. ఆ బోర్డు యాజమాన్యం కూడా ఆంధ్రప్రదేశ్ ఒత్తిళ్లకు లొంగి తమకు అన్యాయం చేసిందంటూ తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ జస్టిస్ రమణ మరియు ముఖోపాధ్యాయ్ లతో కూడిన ధర్మాసనం ‘నాట్ బిఫోర్’ అనే చిన్న కామెంటుతో తన నిర్ణయాన్ని రిజర్వులో ఉంచడం విశేషం.
కేసీఆర్ ప్రభుత్వం నిత్యం కోర్టుగడపలు ఎక్కి దిగుతుంటే, చంద్రబాబు నాయుడు పొరుగునున్న కర్నాటక రాష్ట్రంలో తుంగభద్రా నది నుండి ఆంధ్రాకు రావలసిన నీళ్ళు తదితర అంశాలపై కర్నాటక ముఖ్యమంత్రితో చర్చించడానికి ఈరోజు బెంగళూరు వెళ్ళారు. వారిరువురూ కూడా చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నందున కోర్టులు, కేసులు అవసరం ఉండవని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చంద్రబాబు తన రాష్ట్రానికి రావలసిన నీళ్ళ గురించి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు స్వయంగా వెళ్ళడానికి కూడా నామోషీ పడలేదు. కానీ కేసీఆర్ కి అహం (ఇగో) అడ్డుపడుతుండటంతో చర్చలకు బదులు కోర్టులకి వెళుతున్నట్లున్నారు. గోటితో పోయేదానికి గొడ్డలి వాడటం అంటే ఇదేనేమో? ఆయన తీరు వల్ల వ్యక్తిగతంగా ఆయనకేమీ నష్టం కలగకపోవచ్చునేమో, కానీ తెలంగాణాకి మాత్రం నష్టం కలిగే ప్రమాదం ఉందని చెప్పవచ్చును.






.webp)



