చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోయిందా?... లేటెస్ట్ సర్వే పై ఎక్స్ క్లూజివ్ స్టోరీ
posted on Sep 25, 2015 5:51PM

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోయిందా? వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో ఏపీకి సెకండ్ ప్లేస్ దక్కినా చంద్రబాబు పనితీరు మాత్రం జనానికి నచ్చలేదా? ప్రభుత్వం ఈ మధ్య నిర్వహించుకున్న సర్వేలో ఏం తేలింది? చంద్రబాబుకి ఎన్ని మార్కులేశారు? సీఎంతో సహా మంత్రులెందుకు టెన్షన్ పడుతున్నారు? ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతున్న సర్వేపై ఎక్స్ క్లూజివ్ స్టోరీ.
ప్రభుత్వ పనితీరుపైనా, మంత్రుల పనితీరుపైనా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకునే ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఓ రిపోర్ట్ షాకిచ్చిందట, పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ మారిన ఈ సర్వే ప్రకారం... చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోయింది, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేనాటికి 43శాతంగా ఉన్న బాబు గ్రాఫ్... ఇప్పుడు 34శాతానికి పడిపోయిందట, దాంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారని, ఎక్కడ లోపం జరిగిందో గుర్తించి సరిదిద్దుకునే పనిలో పడ్డారని అంటున్నారు, అందుకే మంత్రులను కూడా అప్రమత్తం చేస్తూ పనితీరు మెరుగుపర్చుకోవాలని హెచ్చరిస్తున్నారట.
చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది కనుక ఆటోమేటిగ్గా జగన్ గ్రాఫ్ పెరిగిందనుకుంటే తప్పులో కాలేసినట్లే, ఎందుకంటే ఈ సర్వే ప్రకారం జగన్ ఇమేజ్ పెరగకపోగా తగ్గిందట, గతంలో 34శాతంగా ఉన్న జగన్ గ్రాఫ్... 21కి పడిపోయిందని, అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం 6 నుంచి 11శాతానికి పెరిగిందని చెబుతున్నారు. అయితే 2014 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత ఉపఎన్నికల్లోనూ అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతంగా డబుల్ అయ్యిందని చెప్పడమే అంత నమ్మశక్యంగా లేదని అంటున్నారు.
రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం కలిగిస్తున్న ఈ సర్వేలో అన్ డిసైడెడ్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారట, ఇటు చంద్రబాబుకు గానీ, అటు జగన్ కు గానీ మద్దతివ్వని వారి సంఖ్య అధికంగా ఉందట.