Latest News
హైకోర్టు కామెంట్లు అదరహో
posted on: Jun 17, 2015 7:46AM

హైకోర్టు ఒక్కోసారి చాలా ముచ్చట కలిగించే విధంగా కామెంట్లు చేస్తూ వుంటుంది. ఆ కామెంట్లు చాలామందికి కనువిప్పు కలిగిస్తూ వుంటాయి. తాజాగా హైకోర్టు చేసిన కొన్ని కామెంట్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారి కళ్ళు తెరిపించ గలిగితే అంతకంటే కావలసింది ఏమీ లేదు. అయితే అభివృద్ధిని అడ్డుకోవడమే పరమావధిగా పనిచేస్తున్నవారిని ఇప్పుడు హైకోర్టు చేసిన కామెంట్లు కదిలిస్తాయా లేదా అనేదే సందేహాస్పదం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో సమయం గడువు ఇచ్చింది. భూ సమీకరణకు వందలాది మంది రైతులు స్పందించి తమ భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు. అయితే దుష్ప్రచారంలో దిట్ట అయిన వైసీపీ ప్రభావానికి గురైన కొంతమంది రైతులు మాత్రం తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చే ప్రస్తకే లేదని అంటూ వచ్చారు. భూ సమీకరణ గడువు ముగిసి ఇప్పుడు కథ భూ సేకరణలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కేవలం ఆరుగురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమ భూములను ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించడమే కాకుండా. కృష్ణానది ఒడ్డున రాజధాని కట్టడం తప్పు అన్నట్టుగా తమ పిటిషన్లలో పేర్కొన్నారు.
అయితే కోర్టు వీరి పిటిషన్‌పై విచారిస్తూ ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. వందలాది మంది రైతులు భూములు ఇచ్చినప్పుడు ఆరుగురు రైతులు అభ్యంతరం వ్యక్తం చేసినంత మాత్రాన అభివృద్ధి పనులను అడ్డుకోవడం కుదరదని స్పష్టం చేసింది. నది ఒడ్డున రాజధానులు వుంటే ఏమీ నష్టం లేదంటూ, ప్రపంచ వ్యాప్తంగా నదుల ఒడ్డున ఉన్న కొన్ని రాజధానుల పేర్లను ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లు తమ పిటిషన్లను వెనక్కి తీసుకోవడానికి కోర్టు అనుమతి తీసుకున్నారు. అంటే, ఈ వివాదం కూడా ముగిసే అవకాశం వుంది. మంచి కామెంట్లు చేసి అభివృద్ధికి సహకరిస్తున్న హైకోర్టుకు హేట్సాఫ్.






