వీళ్ళకి ఏడుపొక్కటే తక్కువ!

 

ఏడవలేక నవ్వే ముఖాలు ఎలా వుంటాయో తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా ఎక్కడికో వెతుక్కుంటూ వెళ్ళా్ల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావుల ముఖాలు చూస్తే చాలు. బీజేపీతో స్నేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కటీఫ్ చెప్పిన తర్వాత వీళ్ళిద్దరికీ మంత్రిపదవులకు రాజీనామాలు చేయక తప్పలేదు. నాలుగేళ్ళుగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా మంత్రి పదవులు వెలగబెట్టిన వీళ్ళిద్దరూ లబోదిబోమంటూనే మంత్రిపదవులు వదిలేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే చంద్రబాబు తన మంత్రివర్గంలో పని సరిగా చేయలేకుండా వున్న మంత్రులకు నిరంతరం క్లాసులు తీసుకుంటూ వుంటారు. కొంతమంది మంత్రులను గతంలో బాధ్యతల నుంచి తప్పించిన సందర్భాలు కూడా వున్నాయి. చంద్రబాబుకు భయపడి మంత్రులు తమ బాధ్యతలలో నిరంతరం నిమగ్నమై వుండేవారు. అయితే కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు మాత్రం ఎలాంటి భయం, ఇబ్బంది, చంద్రబాబు చేత క్లాసుల సీను లేకుండా మంత్రి పదవులను ఎంజాయ్ చేశారు. మిత్రపక్షం నుంచి మంత్రులుగా వున్న సౌలభ్యాన్ని పూర్తిగా అనుభవించారు. తమ పార్టీకి చెందిన నాయకులు టీడీపీని దారుణంగా విమర్శిస్తున్నప్పటికీ వాటిని ఖండించకుండా మౌనం వహించారు. ఎలాంటి టార్గెట్స్, ర్యాంకుల ఇబ్బంది లేకుండా నాలుగేళ్ళు మంత్రులుగా ఒక వెలుగు వెలిగారు. ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా తమ పదవులను వదిలిపెట్టాల్సి రావడంతో వీళ్ళకి ఏడుపు ఒక్కటే తక్కువయింది.

 

టీడీపీ ప్రభుత్వంలో వున్న ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేశారు సరే... ఇంకా రాజీనామాలు చేయాల్సిన వాళ్ళ లిస్టు బాగానేవుంది. టీడీపీ సహకారంతో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు, ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సోము వీర్రాజు, పీవీఎన్ మాధవ్ సాంకేతికంగా రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. అయితే బీజేపీ నాయకులు చాలామంది టీటీడీలో బోర్డు సభ్యులుగా పదవులు పొందారు. ఇంకా 137 మంది టెంపుల్ కమిటీ మెంబర్లుగా వున్నారు. పలు కార్పొరేషన్లకు బీజేపీ నాయకులు కూడా ఛైర్మన్లుగా వున్నారు... ప్రభుత్వ పదవులు పొందిన అనేకమంది బీజేపీ నాయకులు వున్నారు.. ఇప్పుడు వాళ్ళందరూ రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి. మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోవడం అంటే ఇదే.. ఎప్పుడో ఎన్నికల్లో గెలుస్తామని ఇప్పుడున్న పదవులు మొత్తం పోగొట్టుకున్నారు.