చంద్రబాబుకి హరిబాబు ఉచిత సలహా
posted on: Sep 23, 2014 8:49PM
.jpeg)
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమయిన బీజేపీ నుండి ఒక అనూహ్య ప్రతిపాదన వచ్చింది. అది చేసిన వారు ఎవరో సాధారణ నేత కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు. నిన్న అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 12జిల్లాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేసారు. అంతే కాదు రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలను చిన్న చిన్న జిల్లాలుగా విడదీయవచ్చో కూడా ఆయనే చెప్పారు. రాష్ట్రంలో పెద్ద జిల్లాలయిన అనంతపూరు, చిత్తూరు, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది మేలు చేస్తుందో లేదో తెలియదు. కానీ ఖచ్చితంగా మరిన్ని కొత్త సమస్యలు సృష్టించడం మాత్రం తధ్యం. తెలంగాణా ఏర్పాటు కాగానే పది జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 25 జిల్లాలుగా మారుస్తానని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో చాలా సార్లు వాగ్దానం చేసారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అందులో సాధకబాధకాలు తెలిసొచ్చాయి. అప్పటికీ కనీసం ఏడు కొత్త జిల్లాలు సృష్టిద్దామని చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. పైగా ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ మరిన్ని కొత్త జిల్లాలు కావాలంటూ ఆందోళనలు, బందులు, నిరాహార దీక్షలు చేయడంతో తెలంగాణా ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. ఒకవేళ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అటువంటి ప్రయత్నం చేసినట్లయితే మళ్ళీ అక్కడి పరిస్థితులే పునరావృతం అవడం తధ్యం.
అయినా ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు ఇప్పుడు ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ఐడియా ఎందుకు వచ్చిందో హరిబాబుకి. ఆయనకు ఓపికుంటే డిల్లీ వెళ్లి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వివిధ ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం, వైజాగ్-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వంటివాటి గురించి పోరాడితే అందరూ హర్షిస్తారు కదా?



.jpg)
.jpg)

.webp)



