చెడపకురా చెడేవు...వైకాపా కోసమేనేమో?
posted on Jun 22, 2015 11:22AM
.jpg)
ఓటుకు నోటు వ్యవహారంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయక తప్పదని, ఆయనను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడని చాలా మంది జోస్యం చెప్పారు. కానీ ఆయన అంతకంటే తీవ్ర నేరమయిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి తీసుకురావడంతో ఒక్కసారిగా పరిస్థితులు, బలాబలాల లెక్కలు అన్నీ మారిపోయాయి. ఈ యుద్దంలో ఎవరు ఎవరిపై పైచేయి సాధించారనే విషయం పక్కనబెడితే, ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి ట్విస్ట్ ఇవ్వడంతో అందరి కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి నిరాశ చెంది ఉండవచ్చును. చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేస్తే, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పూర్తిగా తనకు అనుకూలంగా మారుతాయని జగన్మోహన్ రెడ్డి భావిస్తే, అందుకు పూర్తి వ్యతిరేకంగా జరిగాయి.
ఈ వ్యవహారంలో రెండు ప్రభుత్వాలు ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇరురువురికీ నష్టమే కనుక ఇక క్రమంగా వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. బహుశః త్వరలో రేవంత్ రెడ్డి తదితరులు కూడా బెయిలు మీద విడుదలయి బయటకు వచ్చేయవచ్చును. కనుక రెండు ప్రభుత్వాలు మళ్ళీ యధావిధిగా తమ పరిపాలనా కార్యక్రమాలలో బిజీ అయిపోవచ్చును. ఈవ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి చాలా ఆచితూచి వ్యవహరించినందున దానికి రెండు రాష్ట్రాలలో కొత్తగా ఎటువంటి నష్టమూ జరుగలేదనే చెప్పవచ్చును. కానీ ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పొరుగు రాష్ట్ర నేతలతో చేతులు కలిపి కుట్రలు పన్నారని తెదేపా చేసిన ఆరోపణల వలన వైకాపా పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడగా, ఆ కుట్రలను ఎదుర్కొని బయటపడినందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజలలో ఎంతో కొంత సానుభూతి కూడా ఏర్పడిందనే చెప్పవచ్చును.
ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడుని, ఆయన ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేద్దామని ప్రయత్నించి జగన్మోహన్ రెడ్డి భంగపడటమే కాదు తన పార్టీకి కూడా ఎంతో కొంత నష్టం కలిగించారు. అందుకే పెద్దలు చెడపకురా చెడేవు అనేవారు. ఆ మాట అక్షరాల వైకాపాకు సరిపోతుందని మరో మారు రుజువయింది.