విభజన బిల్లుకి సవరణలు సాధ్యమేనా?

 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం తనకు కంచుకోట వంటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రద్దలు కొట్టుకోవడానికి కూడా వెనుకాడలేదు. అయితే వ్రతం చెడ్డా ఫలం కూడా దక్కలేదన్నట్లయింది దాని పరిస్థితి. అయితే అది చేసిన తప్పుకి నేడు ఆంద్ర, తెలంగాణా ప్రజలు, ప్రభుత్వాలు గొడవలుపడాల్సి వస్తోంది. రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత అవి క్రమంగా తగ్గకపోగా నానాటికీ మరింత పెరుగుతున్నాయి. గవర్నర్ నరసింహన్ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేక చేతులెత్తేశారు. ఇక కేంద్రమో లేకపోతే సుప్రీంకోర్టో జోక్యం చేసుకొని ఈ సమస్యలను పరిష్కరించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కొన్ని గొడవలు సుప్రీంకోర్టుకు చేరుకోన్నాయి. బహుశః త్వరలో మరిన్ని పిటిషన్లు పడవచ్చును. అదేజరిగితే, ఇంతవరకు నిర్లిప్తంగా కూర్చోన్నందుకు సుప్రీంకోర్టు మొదట కేంద్రానికి మొట్టికాయలు వేసినా ఆశ్చర్యం లేదు. మరి ఆ భయంతోనో లేక ఈ సమస్యలను పరిష్కరించక తప్పని పరిస్థితులు ఏర్పడినందునో గానీ, కేంద్రం అవసరమయితే రాజ్యాంగాన్ని కానీ లేదా విభజన బిల్లును గానీ సవరించడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్నట్లు కేంద్రమంత్రి యం. వెంకయ్యనాయుడు తెలిపారు.

 

కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో న్యాయ సలహాలు కోరిందని తెలిపారు. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ ని కూడా ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సహాయం అందించమని కోరినట్లు ఆయన తెలిపారు. అయితే ఈసారి ఇరు రాష్ట్రాల ప్రతినిధులను సంప్రదించి వారి సలహాలను, సూచనలను అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఆ ప్రకారమే రాజ్యాంగంలో కానీ విభజన బిల్లులో గానీ నియమ నిబంధనలు మార్చుతామని ఆయన తెలిపారు.

 

వాస్తవిక దృక్పధంతో చూస్తే వెంకయ్యనాయుడు పద్ధతి ద్వారా అన్ని సమస్యలను శాస్వితంగా పరిష్కరించే అవకాశం ఉంది. కానీ ప్రతీ విషయంలో తమ మాటే నెగ్గాలని, తమ వాదనే సరయినదని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నప్పుడు, బిల్లులో లేదా రాజ్యాంగంలో సవరణలు సాధ్యమేనా? అని ఆలోచిస్తే సాధ్యం కాదనే అనిపిస్తుంది. విభజన బిల్లును కదపడం అంటే తేనే తుట్టెను కదపడమేనని చెప్పవచ్చును. కానీ ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే ఈ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు కనుక ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకోవడమే మంచిదని చెప్పవచ్చును.