జాప్యంతో జటిలమవుతున్న రాజధాని అంశం

 

రాష్ట్ర విభజన వ్యవహారంలాగే ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణ వ్యవహారం కూడా చివరికి చిలికి చిలికి గాలివానలా మారేలా ఉంది. రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై ప్రభుత్వానికి స్పష్టత ఉన్నప్పటికీ, ఆ నిర్ణయాన్ని విస్పష్టంగా ప్రకటించడంలో జరుగుతున్న జాప్యంవల్ల నానాటికీ సమస్య జటిలమవుతోంది. రాజధాని నిర్మించాలనుకొంటున్న విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలో తగినన్ని ప్రభుత్వభూములు లేకపోయినప్పటికీ, రాజధాని అక్కడ ఉంటేనే అన్ని జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని భావిస్తుండటంతో, ఆ ప్రాంతాలలో భూముల ధరలు పెరిగిపోతున్నాయి. రాయలసీమలో విస్తారంగా ప్రభుత్వ భూములు లభ్యమవుతున్నప్పటికీ, ప్రభుత్వం తను నిర్ణయించుకొన్న ప్రాంతంలోనే రాజధాని నిర్మించాలని భావిస్తుండటంతో అన్ని వైపుల నుండి విమర్శలు ఎదుర్కోక తప్పడంలేదు.

 

 

వైయస్సార్ కాంగ్రెస్ ఈ అంశానికి రాజకీయరంగు పులిమే ప్రయత్నం చేస్తుంటే, రాజధాని కోరుకొంటున్న రాయలసీమవాసులు అప్పుడే ఉద్యమబాట పట్టారు. నానాటికీ పెరిగిపోతున్న భూముల ధరలు, ప్రతిపక్షాల విమర్శలు, రాజకీయాలు, రాజధాని కోసం ఉద్యమాలు, శివరామకృష్ణన్ కమిటీ ఇంకా తన నివేదిక సమర్పించకపోవడం వంటి అనేక కారణల చేత ప్రభుత్వం రాజధాని అంశంపై ఒక స్పష్టమయిన ప్రకటన చేయలేకపోతోందని అర్ధమవుతోంది. ఈ పరిస్థితులలో మంత్రుల ప్రకటనలు, రాజధాని కోసం కొత్తగా మరొక కమిటీ ఏర్పాటు వంటివి మరింత అగ్గి రాజేస్తున్నాయి. నిన్నముఖ్యమంత్రితో సమావేశమయిన శివరామకృష్ణన్ కమిటీ, వచ్చే నెల 20లోగా తమ తుది నివేదిక అందజేస్తామని చెప్పగా, ఆ నివేదిక అందిన మూడు నెలలలోగా రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటిస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. అంటే మరో మూడు నెలల వరకు రాజధాని ఎక్కడ నిర్మించబోతున్నారనే విషయంపై స్పష్టతరాదని స్పష్టం అవుతోంది.

 

రాష్ట్రానికి ఒక శాశ్విత రాజధాని ఏర్పాటు చేయడం అనేక సంక్లిష్టమయిన అంశాలతో ముడిపడున్న మాట వాస్తవమే. కానీ ఈ విషయంలో జాప్యం జరుగుతున్న కొద్దీ సమస్యలు మరింత జటిలమయి, చివరికి ఊహించని అనేక కొత్త సమస్యలను సృష్టించే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ప్రభుత్వం వీలయిననంత త్వరగా రాజధానిపై తన నిర్ణయాన్ని ప్రకటించి వెంటనే పనులు కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేయడం మంచిది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu