Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తులసి గబ్బార్డ్.. యుద్ధ వ్యతిరేక సిద్ధాంతం నుంచి.. ట్రంప్ విధేయత వరకూ.. ఓ విషాద ప్రస్థానం
posted on: May 23, 2026 4:19PM

అమెరికా రాజకీయాల్లో ఒకప్పుడు యుద్ధ వ్యతిరేక గళం గా సూత్రబద్ధమైన నాయకురాలిగా పేరుగాంచిన తులసి గబ్బార్డ్ రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఒక విషాద ముగింపుకు చేరుకుంది. డొనాల్డ్ ట్రంప్ జాతీయ గూఢచార డైరెక్టర్ (డీఎన్ఐ) పదవికి ఆమె రాజీనామా చేయడం.. అమెరికా రాజకీయాల్లో వ్యక్తిగత సిద్ధాంతాలు, రాజకీయ అనుకూలత మధ్య జరుగుతున్న సంఘర్షణకు ప్రతీకగా నిలుస్తోంది. 15 నెలల పదవీకాలం తర్వాత.. ఆమె తన రాజకీయ ఉనికిని, నమ్మకాన్ని కోల్పోయి నిష్క్రమించడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
సిద్ధాంతాల నుండి రాజీ వరకు: గబ్బార్డ్ ప్రస్థానం
ఒకప్పుడు పాలన మార్పు యుద్ధాలు అంటే రిజైమ్ ఛేంజ్ వార్స్ అమానవీయమనీ.. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో అమెరికా జోక్యం ఆపాలని గట్టిగా వాదించిన గబ్బార్డ్, ట్రంప్ ప్రభుత్వంలో చేరాక తన మూల సూత్రాలను తానే ఫణంగా పెట్టారు. ఇరాన్ పై ట్రంప్ ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ లో ఆమె తీసుకున్న వైఖరి ఆశ్చర్యకరం. తన హృదయానికి దగ్గరైన యుద్ధ వ్యతిరేకత' అనే నినాదాన్ని పక్కనబెట్టి.. ఇరాన్ తక్షణ ముప్పు కలిగిస్తోందంటూ ప్రభుత్వానికి వంతపాడటం ఆమె విశ్వసనీయతను దారుణంగా దెబ్బతీసింది. ఒకప్పుడు యుద్ధ వ్యతిరేక నినాదాలతో టీ-షర్టులు అమ్మి.. యుద్ధాలను వ్యతిరేకించిన గబ్బార్డ్.. అధికారం కోసం తన రాజకీయ ఆత్మను బలిపెట్టుకోవడం ఆమె అభిమానులకు, రాజకీయ పరిశీలకులకు రుచించలేదు.
2016లో బెర్నీ శాండర్స్ కు మద్దతు ఇస్తూ డెమోక్రటిక్ పార్టీని వీడిన గబ్బార్డ్.. క్రమంగా రిపబ్లికన్ పార్టీ వైపు ఆకర్షితురాలయ్యారు. ట్రంప్ కు విధేయురాలిగా ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆమె భావించినప్పటికీ.. ట్రంప్ రాజకీయ శైలిలో విధేయతకు మించి అవసరం ముఖ్యం. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి నిరసనగా పదవికి రాజీనామా చేసి ఉంటే.. ఆమెకు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం దక్కేది. కానీ.. పదవిని కాపాడుకునేందుకు ఆమె రాజీ పడటంతో.. చివరికి ట్రంప్ ఆమెను తొలగించాలనే ఆలోచనకు రావడంతో ఆమె రాజకీయంగా ఒంటరైపోయారు.
2024 ఎన్నికల్లో ట్రంప్ ను ఒక శాంతి అభ్యర్థి గా నమ్మి మద్దతు తెలిపిన చాలా మంది ప్రముఖులు ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారు. రోగన్ వంటి వారు తమ తప్పును అంగీకరించడానికి సిద్ధపడుతుండగా.. కెన్నెడీ, గబ్బార్డ్ వంటి వారు ఇంకా విధేయతనే నమ్ముకున్నారు. ట్రంప్ రాజకీయ కూటమిలో చేరిన వారికి తెలిసి వచ్చిన పాఠం ఏంటంటే.. అక్కడ విధేయత ఎల్లప్పుడూ ఏకపక్షమే. అధికార రాజకీయాల్లో సిద్ధాంతాలను మర్చిపోయి.. ఒక వ్యక్తికి అంకితమైతే చివరికి వచ్చేది పరాభవమేనని గబ్బార్డ్ ఉదంతం నిరూపిస్తోంది.
చివరిగా తులసి గబ్బార్డ్ ప్రస్థానం అమెరికా రాజకీయాల్లో ఒకరిని విమర్శిస్తూ ఎదిగి.. చివరకు వారికే దాసోహం కావడం వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తున్నది. తనదైన ప్రత్యేక గుర్తింపును, విశ్వసనీయతను వదిలేసి, ఒక రాజకీయ యంత్రంలో భాగమైతే ఏమవుతుందో గబ్బార్డ్ వైనం చూపిస్తోంది. ఏ సిద్ధాంతం కోసం అయితే ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో.. అదే సిద్ధాంతాన్ని పక్కన పెట్టడం ఆమె రాజకీయ ముగింపుకు కారణమైంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.





