తెరపైకి ఐ బొమ్మ వన్.. పైరసీ నాన్ స్టాప్
posted on Nov 20, 2025 1:22PM

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం అన్న పాట చందంగా తయారైంది సినిమా పైరసీల వెబ్ సైట్ ల పరిస్థితి. ఐబొమ్మ రవిని అరెస్టు చేసి ఆ ఐబొమ్మ వెబ్ సైట్ ను పోలీసులు ఇలా క్లోజ్ చేశారో లేదో.. అలా మరో పైరసీ వెబ్ సైట్ తెరమీదకు వచ్చింది. ఇబొమ్మ వన్ దాని పేరు. దీనిని బట్టి చూస్తుంటే.. ఐబొమ్మ రవి అరెస్టుతో మొత్తం పైరసీని కట్టడి చేసినట్లు కాదని పోలీసు అధికారి సీవీ ఆనంద్ చెప్పిన మాట నిజమే అనిపించక మానదు. నిన్నమొన్నటి వరకూ రవి అధ్వర్యంలో నడిచే ఐబొమ్మ, బప్పం టీవీల పని ఇక అయిపోయింది. సినిమా ఫీల్డ్ ఇక ఎంచక్కా లాభాల ఆర్జన చేయవచ్చనుకుంటుంటే.. ఐబొమ్మ వన్ అంటూ మరో కొత్త పైరసీ వెబ్ సైట్ తెరమీదకు వచ్చి ఒక్కొక్కరికీ దిమ్మ తిరిగి మళ్లీ బొమ్మ కనిపించేలా చేసింది. ఇందులో కూడా సరిగ్గా సినిమా పైరసీ కంటెంటే ఉంది. క్లిక్ చేస్తే చాలు నేరుగా మూవీ వరల్డ్ లోకి తీసుకుపోతుంది.
దీనంతటికీ కారణం ఐ బొమ్మ ఎకో సిస్టమ్ లో 65 మిర్రర్ వెబ్ సైట్స్ ఉన్నాయనీ, అందులో భాగంగానే ఈ కొత్త సైట్ ప్రత్యక్షమైందనీ చెబుతున్నారు అధికారులు. ఈ లెక్కన ఈ పైరసీ బెడద తెలుగు సినిమాకి ఇప్పట్లో వదిలేలా లేరన్న మాట నిజమేనంటున్నారు. సీవీ ఆనంద్ ఈ అంశంపై మాట్లాడుతూ, మన దగ్గర నివారణ తప్ప మరెలాంటి శాస్వత పరిష్కారం లేదని చెప్పుకొచ్చారు. ఒకటి పోతే మరొకటి అలా పుట్టుకొస్తూనే ఉంటాయి. దొరికినపుడు వాటి నిర్వాహకులను అరెస్టు చేయడమే అంతే!