అమరావతి ప్రగతి పరుగులో మరో మైలురాయి.!

posted on: Jul 16, 2026 11:19AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి  అభివృద్ధి బాటలో మరో కీలక ముందడుగు పడింది.   రాజధాని  అమరావతి పరిధిలో , విద్య, పర్యాటక రంగాల బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్డీఏ  నగరంలో కొత్తగా ఐదు ప్రతిష్టాత్మక పాఠశాలలు, అలాగే ఐదు   స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఆసక్తి కలిగిన  సంస్థల నుండి  ఆర్‌ఎఫ్‌పీ  ఆహ్వానిస్తూ  టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు స్థానికులకు, పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి వసతులు అందుబాటులోకి రానున్నాయి.

ఈ టెండర్ల ప్రక్రియలో భాగంగా విద్యా రంగానికి సంబంధించి మొత్తం ఐదు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మూడు సాధారణ డే స్కూళ్లు కాగా, మిగిలిన రెండు పూర్తి స్థాయి వసతులతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలలు. దీనితో పాటు రాజధానికి వచ్చే సందర్శకులు, వ్యాపారవేత్తలు, పర్యాటకుల సౌకర్యార్థం ఐదు  స్టార్  హోటళ్లను కూడా నిర్మించనున్నారు. ఈ హోటళ్లలో మూడు హోటళ్లు 'త్రీ స్టార్' సదుపాయాలతో,  మిగిలిన రెండు హోటళ్లు ఫోర్ స్టార్ సదుపాయాలతో పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు సంబంధించిన భూ కేటాయింపులు, ఇతర సాంకేతిక ప్రక్రియలను సీఆర్డీఏ వేగవంతం చేస్తోంది.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వైపు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక ప్రముఖ విద్యా సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడ తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు ముందుకు రాగా, వాటికి అనుగుణంగా సీఆర్డీఏ ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్థలాలను కూడా కేటాయించింది. గతంలో స్థలాలు పొందిన వాటిలో పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్, సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్ స్కూల్, సెయింట్ గాబ్రియేల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వంటివి ఉన్నాయి. వీటితో పాటు సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ , కేంద్రీయ విద్యాలయం, బాసిల్ వుడ్స్ స్కూల్,  డీపీఎస్ స్కూల్ వంటి ప్రసిద్ధ విద్యా సంస్థలు కూడా రాజధాని పరిధిలో తమ ఉనికిని చాటుకోవడానికి సిద్ధమవుతున్నాయి.

అమరావతి కేవలం ప్రాథమిక, సెకండరీ విద్యకే   కాకుండా,  ఉన్నత విద్యా హబ్‌గా కూడా అవతరిస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఎస్‌ఆర్‌ఎం, విట్, అమృత యూనివర్సిటీలు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్  వంటి ప్రతిష్టాత్మక సంస్థలు తమ విద్యా కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ క్యాంపస్‌లలో  35 వేల మందికి పైగా విద్యార్థులు వివిధ రకాల విద్యా కోర్సులను అభ్యసిస్తున్నారు. ఈ ఉన్నత విద్యా సంస్థల విస్తరణ కోసం ప్రభుత్వం ఇటీవల ఎస్‌ఆర్‌ఎం, విట్ సంస్థలకు అదనంగా మరో 100 ఎకరాల చొప్పున భూమిని కేటాయించింది. ఈ అదనపు స్థలాల్లో  క వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ఆయా యాజమాన్యాలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.

మరోవైపు, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్)కు కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ప్రభుత్వం   70 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే పూర్తవగా, త్వరలోనే పూర్తి స్థాయి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇవే కాకుండా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐయూఎల్ఈఆర్), ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) వంటి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సంస్థలకు కూడా సీఆర్డీఏ స్థలాలను  కేటాయించింది. విద్యా రంగంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించేందుకు, రాజధాని నగరానికి ఆతిథ్య రంగంలో మేటి గుర్తింపు తెచ్చేందుకు గతంలో కొన్ని హోటళ్లకు స్థలాలు ఇవ్వగా, ఇప్పుడు అదనంగా మరో ఐదు హోటళ్లకు  టెండర్ల ప్రక్రియను ప్రారంభించడం విశేషం.

ఈ   నిర్మాణాల వల్ల అమరావతి కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, పారిశ్రామిక, విద్యా  పర్యాటక రంగాల సమ్మేళనంగా రూపాంతరం చెందనుంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు, హోటళ్లు అందుబాటులోకి రావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా, రాజధాని ప్రాంత ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

CRDA,  Amaravati Tenders, Schools, Hotels

google-ad-img
    Related Sigment News
    • Loading...