గంజాయి ముఠా గుట్టురట్టు...14 మంది అరెస్ట్

 

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అన్నమయ్య జిల్లా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. కలకడ మండలంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, దాని వెనుక ఉన్న ప్రధాన నిందితుడు షేక్ బాషా తో కలిపి 14 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను జిల్లా ఎస్పీ  ధీరజ్ కునుబిల్లి సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

గంజాయి ముఠాపై  మెరుపుదాడి
 

రాయచోటి డిఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్, కలకడ సీఐ బి.లక్ష్మన్న పర్యవేక్షణలో, కలకడ ఎస్ఐ బి.రామాంజనేయులు పక్కా సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు.  కలకడ మండలంలోని బంగారువాండ్లపల్లి, నడిమిచెర్ల - కొత్తపల్లి రోడ్డులోని రాతిదిబ్బ సమీపంలో పోలీసులు దాడిచేయగా, గంజాయితో సిద్ధంగావున్న నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో పట్టుబడిన 13 మంది పురుషులు, ఒక మహిళా నిందితురాలు సహా మొత్తం 14 మందిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

నిందితుల వద్దనుంచి సుమారు రూ. 10.20 లక్షలు విలువ చేసే 34 కిలోల గంజాయిని, రవాణాకు ఉపయోగించిన ఒక ఆటో, మూడు మోటార్ సైకిళ్లను 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్ బాషా ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి, స్థానిక చిన్న విక్రయదారుల ద్వారా జిల్లాలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎస్పీ పేర్కొన్నారు.

అరెస్టు అయిన 14 మంది నిందితులపై  క్రైమ్ నెంబర్ 109/2025 కింద  ఎన్ డి పి ఎస్  చట్టంలోని సెక్షన్ 20(బి)(ii)(ఏ),(బి)(సి) లతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌ నిమిత్తం వాయల్పాడు కోర్టుకు పంపుతున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి  వివరించారు. ఈ కేసులో ఇంకా నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. 

జిల్లాలో గంజాయి విక్రయాలను, వినియోగాన్ని సహించేది లేదని ఎస్పీ  మరోసారి గట్టిగా హెచ్చరించారు. గంజాయి సేవించే యువత వెంటనే వ్యసనాన్ని వదిలిపెట్టి, చదువుపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల విక్రయాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ప్రజలను కోరారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన రాయచోటి డిఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్, కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ బి. రామాంజనేయులు, పిఎస్ఐ కుమారి హారిక, మరియు పోలీసు సిబ్బందిని ఎస్పీ  ప్రత్యేకంగా అభినందించారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu