త‌మిళ‌నాట అణ్ణామ‌లై.. అటా ఇటా?

posted on: Jun 3, 2026 3:39PM

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు   అణ్ణామలై, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన త్రిభాషా విద్యా విధానాన్ని బహిరంగంగా వ్యతిరేకించడం ద్వారా పార్టీలోనే కాకుండా, మొత్తం తమిళనాడు రాజకీయాలలో పెద్ద ఎత్తున కలకలం రేపారు. ఈ వివాదం వెనుక ఆయన అసంతృప్తి, పార్టీ అధిష్టానంతో ఉన్న విబేధాలు,  రాబోయే సంచ‌ల‌న‌ నిర్ణయంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు నడుస్తున్నాయి. 

అణ్ణామలై రాజకీయ ప్రయాణం ఎలాంటిదో చూస్తే..  1984 జూన్ 4న  త‌మిళ‌నాడులోని..  క‌రూర్ జిల్లాలో జ‌న్మించారు. కోయంబ‌త్తూర్ పీఎస్జీ కాలేజీలో మెకానిక‌ల్ ఇంజినీరింగ్ చ‌దివిన అన్నామ‌లై, ల‌క్నో ఐఐఎంలో ఎంబీఏ చేశారు. త‌ర్వాత  2011 నుంచి 2019 వరకు కర్ణాటక కేడ‌ర్ ఐపీఎస్ అధికారిగా ప‌ని చేసిన‌ ఆయ‌న‌..  2019లో రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2020 ఆగ‌స్టులో ఆయ‌న త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షుడిగా  నియ‌మితుల‌య్యారు.  2021- 25 మ‌ధ్య కాలంలో త‌మిళ‌నాడులో బీజేపీ ఓట్ షేర్ 3 శాతం  నుంచి 11 శాతానికి  పెంచ‌డంలో ఆయ‌న కృషి చేశారు.
 
అణ్ణామలై అనేక ఏళ్ల పాటు యువతలో బీజేపీకి క్రేజ్ తీసుకురావడానికీ..  డీఎంకే వ్యతిరేక రాజకీయాన్ని బలోపేతం చేయడానికి ప్రధాన కారకుడిగా నిలిచారు.  2026 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టోట‌ల్ గా ఒక్క సీట్ మాత్రమే గెలుచుకోవడం, ఆయనకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు లేదా కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవడం వల్ల అసంతృప్తి పెరిగింది. 

ఇక త్రిభాషా  వ్య‌వ‌హారం.సీబీఎస్ఈ, 9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేస్తూ.. 2029-30 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించింది కేంద్రం. ఈ ఆకస్మిక మార్పు ఒక ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామంగా మారింది. 2026 మే 15న‌ సీబీఎస్ఈ  నోటిఫికేషన్ జారీ చేసి, 2026 జూలై 1  నుంచి  9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేయాలని ఆదేశించింది.  నోటిఫికేషన్ ప్రకారం, విద్యార్థులు ఆర్1, ఆర్2, ఆర్3  అనే మూడు భాషలను చ‌ద‌వాలి, వీటిలో కనీసం రెండు భారతీయ భాషలై ఉండాలి. దీన్ని తీవ్రంగా  వ్య‌తిరేకించారు అణ్ణామలై.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను నోటిఫికేషన్ వెనక్కి తీసుకోమని కోరారాయ‌న‌.  ఇది తమిళనాడు తల్లిదండ్రులకు ఇబ్బందిక‌ర‌మ‌నీ.. పిల్లలపై ఒత్తిడి పెంచ‌డంలో భాగ‌మ‌నీ.. మొత్తం  ఫలితాలను తారుమారు చేస్తుంద‌నీ అంటారాయ‌న‌. సీబీఎస్ఈ  ముందుగా చేసిన హామీని పాటించాల‌ని డిమాండ్ చేశారు అణ్ణామ‌లై.

కేంద్ర ప్రభుత్వ పథకాలకు గట్టి మద్దతుదారుడిగా నిలిచే అణ్ణామలై, మొదటిసారిగా బహిరంగంగా వ్యతిరేక స్వరాలు వినిపించడం.. బీజేపీ వర్గాల్లోనే పెద్ద కలకలం సృష్టించింది. ఇది వారు ఊహించ‌ని  ప‌రిణామం.  ఇక అణ్ణామ‌లైలో అసంతృప్తికి గ‌ల మ‌రో కార‌ణ‌మేంటంటే.. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయ‌న్ను తప్పించిన తర్వాత, ఆయనకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు, కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవడం. 

ఇక‌ బీజేపీ-అన్నాడీఎంకే కూటమిని సైతం తీవ్రంగా వ్యతిరేకించారు  అణ్ణామలై. కానీ, పార్టీ అధిష్టానం ఈ కూటమిని కొనసాగించింది. క్షేత్ర స్థాయి అభ్యర్థుల నియామకంలోనూ అదే తంతు. పలు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలనే ఆయన సూచనలను అధిష్టానం పూర్తిగా  పెడ‌చెవిన పెట్టింది.

2026 ఎన్నికలలో తాను ఒక‌ అభ్యర్థిగా లేకపోవడం మ‌రో కీల‌క మ‌లుపుగా  నిలిచింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అణ్ణామలై పేరు బీజేపీ అభ్యర్థుల జాబితాలో ప్ర‌క‌టించ‌క పోవ‌డం అంద‌రినీ షాక్ కి గురి చేసింది. ఇంకా  జూమ్ చేసి చూస్తే.. ఆయన అసంతృప్తికి మ‌రో ప్రధాన కారణం... ఎన్నికల్లో ఆయన మద్దతుదారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం. 
 త్రిభాషా విధానంపై అణ్ణామలై న్యాయపరమైన విమర్శను నేరుగా చేయలేదు, కానీ.. ముందుగా ఇచ్చిన‌ హామీని తుంగలో తొక్కినట్లుగా ఆరోపించారు. ఇక మీడియా విశ్లేష‌ణ‌ల ప‌రిశీలిస్తే.. అణ్ణామ‌లై.. బీజేపీపై అసంతృప్తితో ఉన్నారా? అంటే, అవున‌నే అంటాయి మీడియా క‌థ‌నాలు. ఇక ఆయ‌న సొంత పార్టీ  పెట్ట‌బోతున్నారా? అన్న ఊహాగానాలు సైతం ఊపందుకున్నాయి. ఒక ద‌శ‌లో అణ్ణామ‌లై డీఎంకేలో చేర‌బోతున్నార‌నే క‌థ‌నాలు కూడా వెలువ‌డ్డాయి. అయితే అణ్ణామ‌లై స్పంద‌న ఎలాంటిదో చూస్తే.. ఆయ‌న ద‌య చేసి వేచి ఉండండి. కొన్నాళ్ల‌లో మ‌నం కూర్చుని మాట్లాడుకుందామ‌ని అన్నారు.  

అణ్ణామ‌లై తాజా ప‌రిస్థితి ఏంట‌ని ప‌రిశీలిస్తే.. ఆయ‌న ఐదు పేజీల రాజీనామా లేఖ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ కి స‌మ‌ర్పించార‌ు. ఇటు బీజేపీకే కాక అటు ద్ర‌విడ వాదానికి సైతం ఒక ప్ర‌త్యామ్న‌య రాజ‌కీయ శ‌క్తిని ఏర్పాటు చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఆరు నుంచి ఎనిమిది  నెల‌ల లోపు అణ్ణామ‌లై కొత్త పార్టీ స్థాపిస్తార‌న్న మాట కూడా వినిపిస్తోంది.  

పార్టీ స్థాప‌న‌లో భాగంగా అణ్ణామలై త్వరలోనే నటుడు రజనీకాంత్‌ను కలవడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి ఉంటే.. అణ్ణామలై అందులో కీలక పాత్ర పోషించి ఉండేవారనే   గ‌తంలో వినిపించింది. వారిద్దరి మధ్య మంచి స‌త్సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు కొంద‌రు. అయితే, రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ, అణ్ణామలైతో ఎలాంటి మాటా మంతీ న‌డ‌వ‌లేద‌ని అన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా అణ్ణామలైతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.  ఆయన్ను పార్టీలోనే కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న‌ట్టు తెలుస్తుంది. తమిళనాడులో బీజేపీ ఎదుగుదలకు అణ్ణామలై ఎంతటి కీలక పాత్ర పోషించారో, పార్టీ నాయకత్వానికి బాగా తెలుస‌ని అంటున్నారు.  అణ్ణామలై తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా బీజేపీపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2026 ఎన్నికలలో బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలిచింది, కానీ ఓట్ షేర్ కొంత పెరిగింది. 

అమిత్ షా చేస్తున్న రాయబార ప్రయత్నాలు ఫలిస్తాయా, లేక అణ్ణామలై తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారా? అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లోనే సమాధానం దొరుకుతుందని భావిస్తున్నారు ప‌లువురు- రాజకీయ విశ్లేషకులు. అణ్ణామలై తీసుకునే ఏ నిర్ణయమైనా తమిళనాడు రాజకీయాలను మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంద‌ని అంటారు.  2026 అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే  ఒంటరిగా అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇది తమిళనాడు రాజకీయాలలో పెద్ద మార్పును సూచిస్తుంది. ఈ స‌మ‌యంలో అణ్ణామ‌లై అడుగులు ఎటు? అవి రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఎలా ప్ర‌భావితం చేస్తాయ‌న్న‌ది పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో అతి  పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...