అమ్మను తలపిస్తున్న అన్న క్యాంటీన్ల సేవలు : నారా భువనేశ్వరి

posted on: Apr 19, 2026 2:10PM

 

ఏపీలో అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. అన్న క్యాంటీన్ల సేవలు ఎంతో మన్నన పొందాయని...లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వహించడం గొప్ప విషయం అని భువనేశ్వరి అభిప్రాయ పడ్డారు. రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో ప్రభుత్వం గౌరవంగా పేదలకు భోజనం అందిస్తోందని అమె అన్నారు. ఏప్రిల్ 20వ తేదీన సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి రూ.76 లక్షలు విరాళంగా అందించారు. 

ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చెక్ ను అన్న క్యాంటీన్ సీఈవోకు అందించారు. చంద్రబాబు జన్మదినం అయిన ఏప్రిల్ 20న రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందించాలని భువనేశ్వరి కోరారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకు కడపు నింపే అన్న క్యాంటీన్లకు విరాళం ఇవ్వడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని భువనేశ్వరి తెలిపారు. అత్యంత పరిశుభ్రమైన వాతారణంలో  అన్న క్యాంటీన్లలో పౌష్టికాహారం అందించడం గొప్ప విషయం అని ఆమె అభిప్రాయ పడ్డారు. 

రోజువారీ కూలీలు, పేదలు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ది పొందుతున్నారని...ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో  ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని భువనేశ్వరి అన్నారు. అన్న క్యాంటీన్లకు ఆర్థికంగా చేయూతనిచ్చి స్ఫూర్తి నింపేందుకు అంతా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే సంతృప్తి ఏముంటుదని వ్యాఖ్యానించిన భువనేశ్వరి....తాను పలు సందర్భాల్లో అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కలిగిన సంతృప్తిని, ప్రజల స్పందనను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 

తమ మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా 12 ఏళ్లుగా ప్రతీ ఏటా తిరుమలలో అన్న ప్రసాదానికి రూ.44 లక్షలు విరాళంగా ఇస్తున్న విషయాన్ని ఆమె ప్రస్థావించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నారా భువనేశ్వరి....అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఈ ఏడాది మీ పుట్టిన రోజుకు మేమిచ్చే బహుమానం అంటూ వ్యాఖ్యానించారు. తన పేరు మీద అన్న క్యాంటీన్లకు ఒక రోజు అన్నదానానికి రూ.76 లక్షల విరాళం ఇచ్చిన తన సతీమణి భువనేశ్వరిని ముఖ్యమంత్రి అభినందించారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... “రాష్ట్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ఒక గొప్ప కార్యక్రమంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. తిరుమలలో భక్తుల సహకారంతో 4 దశాబ్దాలుగా అన్నదానం జరుగుతోంది. అలాగే ప్రముఖ దేవాలయాల్లోనూ అన్నదానం నిర్వహిస్తున్నాం. పేదలకు రూ.5 లకే కడుపునింపే అన్న క్యాంటీన్ సేవలను మరింత విస్తరించాలి. నాణ్యతను పాటించడంతో పాటు..పవిత్రంగా, గౌరవంగా, పరిశుభ్రంగా ఆహారం అందించే ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలి. పుట్టిన రోజు, పెళ్లి రోజు సహా తమకు నచ్చిన రోజు భోజనాలకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలి. ఇదొక స్ఫూర్తి దాయకమైన కార్యక్రమంగా మారి బ్రాండ్ ను సృష్టించాలి' అని చంద్రబాబు అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...