శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

posted on: Oct 30, 2025 10:12AM

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో గురువారం జ‌రుగ‌నున్న పుష్ప‌యాగానికి బుధ‌వారం (అక్టోబర్ 29) రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయించడాన్ని ఋత్విక్‌వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు.

సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు ఈ విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు. రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌వారి సేనాధిప‌తి అయిన శ్రీ విష్వ‌క్సేనుల వారిని ఆల‌యం నుండి వ‌సంత మండ‌పానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్క‌డ మృత్సంగ్ర‌హ‌ణం, ఆస్థానం నిర్వ‌హించి తిరిగి శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకున్నారు. రాత్రి 8 నుండి 9గంట‌ల నడుమ ఆల‌యంలోని యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను తిరుమల తిరుపతి దేవస్థానం ర‌ద్దు చేసింది.  

ఇలా ఉండగా శ్రీ‌వారి ఆల‌యంలో గురువారం (అక్టోబర్ 30) పుష్పయాగం సంద‌ర్భంగా ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ‌ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత  మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జితసేవలైన తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత‌ బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...