పొన్నంపై అంజన్ కుమార్ యాదవ్ ఫైర్.. కారణమేంటంటే?
posted on Oct 4, 2025 3:38PM

జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపుతోంది. జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నేతల సంఖ్య భారీగా ఉండటంతో అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్నది తేల్చుకోలేక పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. మీనాక్షి నటరాజన్ ను రంగంలోకి దింపి ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నాలు చేస్తున్నది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో మాత్రం అధిష్ఠానం ప్రయత్నాలు అధిష్ఠానానివే.. అన్నట్లుగా ఉంది. ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.
ఇక పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు టీకెట్ పై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీలో విభేదాలు కూడా జూబ్లీ బైపోల్ ముంగిట రచ్చకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ మంత్రి పొన్నం మీద ఫైర్ అయ్యారు. తన కుమారుడు ఎంపీగా ఉండటంపై కామెంట్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు అంజన్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది హైకమాండ్ నిర్ణయిస్తుంది, దీనిపై మాట్లాడడానికి మధ్యలో పొన్నం ప్రభాకర్ ఎవరంటూ ఫైర్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ కంటే తాను చాలా సీనియర్ ని అని అంటూ.. కాంగ్రెస్ లో ఒకే కుబుంబం నుంచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చాలా మంది ఉన్నారంటూ ఓ పెద్ద లిస్టు చెప్పారు. ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టివిక్రమార్క ఉండగా, ఆయన అన్న మల్లు రవి ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు.
అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి, మంత్రి కొమటిరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ల పేర్లు ప్రస్తావించారు. ఇలా ఒకే కుటుంబం నుంచి రెండు పదవులు ఉన్నవారు చాలా మంది ఉన్నారన్నారు. అటువంటప్పుడు తన కుమారుడు ఎంపీ అయితే జూబ్లీ బైపోల్ లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి తనకు అన్ని అర్హతలూ ఉన్నాయన్న అంజన్ కుమార్ యాదవ్ పార్టీ అధిష్ఠానం తనకే టికెట్ ఇస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమాతోనే ఆయన ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కటౌట్ లు ఏర్పాటు చేశారు. ఇంటింటి ప్రచారాన్ని కూడా షురూ చేసేశారు.