ఆండ్రాయిడ్ ఎహెడ్ ఆఫ్ ఐఫోన్.. కారణమేంటంటే?

posted on: Apr 27, 2026 4:07PM

దశాబ్ద కాలంగా ప్రపంచ స్మార్ట్‌ఫోన్ విపణిలో ఆపిల్ ఐఓఎస్, గూగుల్ ఆండ్రాయిడ్ మధ్య ఆధిపత్య పోరు  సాగుతోంది. ఇటీవలి కాలంలో ఐఫోన్ 17 ప్రో వంటి అత్యాధునిక పరికరాలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ..  ఫోన్ పనితీరుపై పూర్తి నియంత్రణను ఆశించే పవర్ యూజర్లు మాత్రం ఆండ్రాయిడ్ వైపే మొగ్గుచూపుతున్నారు. కేవలం వినియోగంలో సరళత్వమే కాకుండా..  తమ అభిరుచులకు అనుగుణంగా ఫోన్‌ను మలచుకునే వీలుండటమే ఇందుకు ప్రాధాన కారణం.  

ఆపిల్ తన ఐఓఎస్ 18 వెర్షన్‌లో కొన్ని మార్పులు చేసినప్పటికీ.. ఆ మార్పులు  ఆండ్రాయిడ్ ఇచ్చే స్వేచ్ఛ ముందు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. ఆండ్రాయిడ్ వినియోగదారులు కేవలం ఐకాన్ల రూపం మార్చడమే కాకుండా.. థర్డ్-పార్టీ లాంచర్లను వాడుతూ ఫోన్ రూపురేఖలనే మార్చేయవచ్చు. అంతేకాకుండా..  ఫోన్ డయలర్, బ్రౌజర్, మెసేజింగ్ వంటి  యాప్‌లను తమకు నచ్చిన వాటితో మార్చుకునే వెసులుబాటు ఉండటం కూడా యూజర్లు ఆండ్రాయిడ్ వైపు మొగ్గు చూపడానికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఐఫోన్‌లో ఇటువంటి ఫీచర్లు  అందుబాటులో లేవు.

 సాంకేతిక నిపుణులకు ఆండ్రాయిడ్ అందించే  డెవలపర్ ఆప్షన్స్ ఒక అద్భుతమైన వరం. ఐఫోన్‌లో ఇటువంటి నియంత్రణ పొందాలంటే ఎక్స్-కోడ్ వంటి పరికరాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్‌లో నేరుగా ఫోన్ నుండే యానిమేషన్ వేగాన్ని మార్చుకోవడం.. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ నియంత్రించడం వంటి వాటి ద్వారా  ఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చు.  ఉత్పాదకత పెంచుకోవాలనుకునే వారికి ఆండ్రాయిడ్ ఒక శక్తివంతమైన సాధనంగా మారుతోంది. ముఖ్యంగా శామ్సంగ్ డెక్స్  వంటి సాంకేతికత ద్వారా ఫోన్‌ను మానిటర్, కీబోర్డ్,  మౌస్‌లకు అనుసంధానించి ఒక పూర్తిస్థాయి కంప్యూటర్‌లా వాడుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ ఫోన్లు కూడా ఇప్పుడు ఇటువంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చాయి. 

దీనికి భిన్నంగా ఐఫోన్ ఇప్పటికీ కేవలం స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్‌కే పరిమితమైంది. ఐఫోన్ కొనేవారు ఆపిల్ ఇచ్చే పరిమిత మోడళ్లలోనే ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్‌లో శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 వంటి ఫోల్డబుల్ ఫోన్ల నుండి ఎస్25 ఆల్ట్రా వంటి అత్యంత శక్తివంతమైన పరికరాల వరకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అలాగే విండోస్, లైనక్స్ వంటి ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో ఆండ్రాయిడ్ సులభంగా అనుసంధానమవుతుంది.  గోప్యతను ప్రాధాన్యత ఇచ్చే వారు గ్రాఫేన్-ఓఎస్ వంటి కస్టమ్ రోమ్స్ ఇన్‌స్టాల్ చేసుకునే వెసులుబాటు కేవలం ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనే సాధ్యం.  రోజువారీ వాడకంలో నోటిఫికేషన్ల పాత్ర చాలా కీలకం. ఐఓఎస్ విధానం చాలా వరకు షెడ్యూల్డ్ సమ్మరీలపై ఆధారపడి ఉంటే.. ఆండ్రాయిడ్‌లో ప్రతి యాప్ నుండి వచ్చే నోటిఫికేషన్‌ను  సూక్ష్మ స్థాయిలో నియంత్రిం చుకోవచ్చు.

బజ్ కిల్ వంటి యాప్స్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన విధంగా వీటిని మేనేజ్ చేసుకోవచ్చు. మొత్తానికి, ఐఫోన్ తన నాణ్యత,  స్థిరత్వానికి పేరుగాంచినప్పటికీ,  వాల్డ్ గార్డెన్ లాంటి ఆపిల్ కట్టుబాట్ల కంటే ఆండ్రాయిడ్ ఇచ్చే స్వేచ్ఛా వాతావరణమే టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో గూగుల్ తీసుకురాబోయే మరిన్ని మార్పులతో ఈ రెండు వ్యవస్థల మధ్య వ్యత్యాసం ఇంకా పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

-సీతారాం కంఠంనేని

google-ad-img
    Related Sigment News
    • Loading...