వాళ్ళ మెదడు మోకాలిలో.. వీళ్ళ మెదడు అరికాలిలో...
posted on Apr 8, 2015 10:41AM

మంగళవారం నాడు జరిగిన రెండు ఎన్‌కౌంటర్లు దేశంలోనే సంచలనం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించగా, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్లో కరడుగట్టిన తీవ్రవాది వికారుద్దీన్‌తో సహా ఐదుగురు తీవ్రవాదులు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్ల పట్ల సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఎన్‌కౌంటర్ అయిన తీవ్రవాదులు సామాన్యులు కాదు.. ఎంతోమంది ప్రాణాలు తీసి, ఎన్నో అరాచకాలు చేసిన దుర్మార్గులు. ఈ తీవ్రవాద ముఠా నాయకుడు వికారుద్దీన్ గురించి చెప్పాలంటే పెద్ద గ్రంథం అవుతుంది. ఎంతోమంది పోలీసులను చంపేశాడు. పోలీసుల ప్రాణాలంటే అతనికి పూచిక పుల్లలతో సమానం. పోలీసులను చంపుతానని చెప్పిమరీ చంపుతాడు. ఎన్నో దోపిడీలు చేశాడు. ఎంతోమంది ప్రాణాలు తీశాడు. గతంలో నరేంద్రమోడీని చంపడానికి కూడా పథకాలు వేశాడు. ఇలాంటి తీవ్రవాది గత కొంతకాలంగా జైల్లో అతిథిగా వుంటూ సకల మర్యాదలు పొందుతున్నాడు. జైల్లో వున్న సిబ్బందిని కూడా బెదిరిస్తూ హవా నడిపిస్తున్నాడు. ఇన్నాళ్ళకు వాడి పాపం పండి పైకిపోయాడని జనం హర్షిస్తున్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేస్తున్న తమిళనాడు కూలీలది మరో కథ. ఎర్రచందనం స్మగ్లర్లకి వెన్నెముకలాంటివాళ్ళు ఈ తమిళనాడు కూలీలే. భారీ మొత్తాలకు కాంట్రాక్టు కుదుర్చుకుని, వందల సంఖ్యలో తమిళనాడు నుంచి ఏపీ అడవుల్లోకి ప్రవేశించి ఎర్రచందనం చెట్లని నరికేస్తూ వుంటారు. ఎవరైనా ఫారెస్టు అధికారులు కనిపిస్తే, వాళ్ళని కూడా చెట్లతోపాటు నరికేస్తూ వుంటారు. ఈ ఎర్రచందనం కూలీలు ఇప్పటి వరకు ఎంతమందిని చంపేశారో లెక్కేలేదు. వీళ్ళలో కొంతమంది వీరప్పన్ ముఠా సభ్యులు కూడా వున్నారు. వీళ్ళ దగ్గర గొడ్డళ్ళు, కొడవళ్ళతోపాటు అవసరమైతే ఉపయోగించడానికి తుపాకులు కూడా వుంటాయంటే వీళ్ళు ఎంత ‘ప్రొఫెషనల్సో’ అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సంఘ విద్రోహశక్తులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటన మీద కూడా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ప్రజల విషయం ఇలా వుంటే, రాజకీయ నాయకులకు మాత్రం ఎక్కడలేని నొప్పి వచ్చిపడింది. తమిళనాడుకు చెందిన కూలీలు ఎన్‌కౌంటర్ అయ్యేసరికి మెదడు మోకాళ్ళలో వున్న అక్కడి రాజకీయ నాయకులకు ఎక్కడలేని పౌరుషం, రోషం ముంచుకొచ్చాయి. తమజాతి వాళ్ళని చంపేశారని మొత్తుకుంటున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం ఒక్కటయిపోయి పోటీలుపడి మొసలికన్నీరు కార్చేస్తున్నారు. చనిపోయిన స్మగ్లర్ల మీద సానుభూతి కురిపించేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పనిలోపనిగా ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళ్ళిన వాహనాలను ధ్వంసం చేసి తరించారు. గతంలో ఈ కూలీలు కమ్ స్మగ్లర్లు ఎన్ని హత్యలు చేసినా ఉలకని పలకని తమిళనాడు నాయకగణం ఇప్పుడు ఇంత హడావిడి చేస్తున్నారు. మరి వాళ్ళ మెదడు మోకాళ్ళలో కాక ఇంకెక్కడున్నట్టు? ఇక ఈ ఎన్‌కౌంటర్లను రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ నాయకులు జగన్, రఘువీరారెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మన ఆరోగ్యాలకి అంత మంచింది.
తమిళనాడు నాయకుల పరిస్థితి ఇలా వుంటే, తెలంగాణలో నాయకుల పరిస్థితి మరీ ఘోరం. ముఖ్యంగా ఎంఐఎం, ఎంబీటీ లాంటి మతవాద పార్టీల నాయకులు మాట్లాడుతున్న తీరు దారుణం.. ఐదుగురు కరడుగట్టిన తీవ్రవాదులు మరణించారని ప్రజలంతా హర్షిస్తుంటే, ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతున్న తీరు జుగుప్స కలిగించేలా వుంది. హేతుబద్ధంగా ఆలోచించాల్సిన ఆయన మెదడు అరికాలిలోకి జారిపోయిన విధానాన్ని సూచించే విధంగా ఆయన తీరు వుంది. పోలీసులు సదరు తీవ్రవాదుల్ని కావాలనే చంపేశారట. సూర్యాపేట ఘటనకు ప్రతీకారంగా తీవ్రవాదుల్ని ఎన్‌కౌంటర్ చేసేశారంట. దీనిమీద ఏవేవో విచారణలు జరిపించాలట... విధినిర్వహణలో పోలీసులు చనిపోయినప్పుడు ఒక్క సానుభూతి వాక్యం కూడా పలకని ఒవైసీ, ఇప్పుడు తీవ్రవాదులు ఎన్‌కౌంటర్ అయిపోగానే వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్న తీరు దారుణం. ఏపీలో అయినా, తెలంగాణలో అయినా ఇలాంటి నాయకులను చూస్తుంటేనే మన సమాజం ఇంకా ఎంత పతనం అయిపోతుందో అనే భయం కలుగుతోంది.