కె.ఇ.కృష్ణమూర్తి ఎందుకు కయ్యిమన్నారో?

 

తెలుగుదేశం మార్కు క్రమశిక్షణతో ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో అకస్మాత్తుగా ఒక ‘ఆగ్రహ గళం’ వినిపించింది. ఆ గళం మీడియా ముందు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ ఆగ్రహ గళం మరెవరిదో కాదు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తిది. తన తోటి మంత్రి నారాయణ విజయవాడ రాజధాని అంటూ ప్రచారం చేయడం వల్లనే ఇక్కడ రేట్లు పెరిగిపోయాయని కె.ఇ. ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ తాత్కాలిక రాజధాని మాత్రమేనని, శాశ్వత రాజధాని మారవచ్చని కూడా చెప్పారు. విజయవాడ చాలా ఇరుకైన ప్రదేశమని, ప్రభుత్వ భూమి కూడా చాలా తక్కువగా వుందని రాజధానికి పనికిరాదన్నట్టుగా చెప్పారు. పనిలోపనిగా కర్నూలు దగ్గర బోలెడంత ప్రభుత్వ భూమి వుందని కూడా అన్నారు. మళ్ళీ అంతలోనే కర్నూలు రాజధాని అవ్వాలని తానేమీ డిమాండ్ చేయడం లేదని చెప్పుకొచ్చారు.

 

క్రమశిక్షణ చాలా ఎక్కువగా వుండే తెలుగుదేశం పార్టీలో ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వున్న కె.ఇ.కృష్ణమూర్తి ఇలా బాహాటంగా తన ఆగ్రహాన్ని ప్రదర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తెలుగుదేశం సంప్రదాయానికి పూర్తి విరుద్ధంగా వున్న కె.ఇ. వ్యవహార శైలి పలువురిని ఆలోచనలో పడేసింది. కె.ఇ. ఆగ్రహం వెనుక వున్న అసలు కారణాన్ని పసిగట్టాలన్న ఆసక్తిని కలిగించింది. ఆ ఆసక్తి పరిశోధన రూపంలోకి మారి జరిపిన అన్వేషణలో అనేక మరింత ఆసక్తికరమైన అంశాలు బయటకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో చాలా సీరియస్‌గా వర్క్ చేస్తున్నారు. మంత్రులు అంటే ఏదో ఆషామాషీగా పదవుల్లో వుండి బిల్డప్పులు ఇచ్చేవాళ్ళు కాదు.. కష్టించి పనిచేసేవాళ్ళు అని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే తన మంత్రివర్గంలో వున్నవారందరూ మెరుగైన పనితీరు ప్రదర్శించాలని భావిస్తున్నారు. పనితీరు బాగాలేని మంత్రులను ఉపేక్షించనని కూడా చెబుతున్నారు. మంత్రుల పనితీరునుబట్టి స్కూలు పిల్లలకు వేసినట్టుగా మార్కులు కూడా వేస్తున్నారు.

 

ఈ మార్కుల ప్రకారం పాస్ మార్కు 35 అయితే, కాస్త వయసు పైబడిన కె.ఇ. కృష్ణమూర్తి ‘18’ మార్కుల దగ్గర ఆగిపోయారని సమాచారం. మరి కె.ఇ. పనితీరు ఇలాగే వుంటే భవిష్యత్తులో ఏదైనా జరిగే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా కె.ఇ. కదుపుతున్న పావుల్లో భాగమే ‘‘మంత్రి నారాయణ మీద ఆగ్రహం’’ అని తెలుస్తోంది. తన పదవి చుట్టూ ‘రాయలసీమ’ అనే కవచాన్ని ఏర్పరచుకునే ప్రయత్నాల్లో భాగంగానే స్వరం పెంచి మాట్లాడారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ‘‘నేను ఇంతవరకూ కర్నూలు రాజధాని అవ్వాలి అని డిమాండ్ చేయలేదు’’ అని కె.ఇ. అన్నారంటే, నా జోలికి వస్తే కర్నూలుని రాజధానిని చేయాలని ఉద్యమం చేస్తానని పరోక్షంగా హెచ్చరించడమేనని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా పెద్దాయన ఇలాంటివి ఆలోచించి మనసు పాడుచేసుకోవడం కంటే, ఇంకాస్త శ్రమించి పనిచేసి, పాస్ మార్కులైనా తెచ్చుకుంటే మంచిదికదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.