ఏపీ కమలదళపతి సోము వీర్రాజు..!

posted on: Jul 8, 2016 5:22PM

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్టే. అధ్యక్షుడి ఎంపిక కోసం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఏపీ బీజేపీ కోర్ కమిటీతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు ఖరారైనట్టు కనిపిస్తోంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అధ్యక్షునిగా బాధ్యతలు అందుకున్న హరిబాబు ఆశించిన స్ధాయిలో పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పోటి చేసిన బీజేపీ-టీడీపీలు ఈసారి పొత్తు పెట్టుకునే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

 

ప్రస్తుత అధ్యక్షుడు హరిబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహర్తిస్తున్నాడని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పైగా కేంద్ర నాయకత్వం చెప్పిన పద్ధతిలో ఏపీలో పార్టీ సభ్యత్వ నమోదు చేయలేకపోయారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. దాంతో హరిబాబును తప్పించి వేరొకరికి పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ భావించింది. అయితే హరిబాబు స్థానంలో ఎవరిని నియమించాలనే విషయంలో తీవ్రంగా కసరత్తు చేసింది. సోము వీర్రాజు, కన్నా, పురంధేశ్వరి, చల్లపల్లి నర్సింహారెడ్డి, శాంతారెడ్డి తదితరుల పేర్లు వినిపించినప్పటికి ప్రస్తుత పరిస్థితుల్లో సోము వీర్రాజే అధ్యక్షునిగా ఉంటే బాగుంటుందని అధినాయకత్వం నిర్ణయించింది.

 

అయితే మొదటి నుంచి సీఎం చంద్రబాబుపై కయ్యానికి కాలు దువ్వుతున్న సోము అధ్యక్షుడైతే రెండు పార్టీల మధ్య ఉన్న మిత్రత్వం దెబ్బతింటుందని ఒక వర్గం హైకమాండ్‌కు సూచించినట్టు సమాచారం. అన్నింటిని బేరీజు వేసుకున్న అమిత్‌షా వీర్రాజు వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. 1978లో జనతా యువమోర్చలో చేరిన సోము వీర్రాజు పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడి స్థాయికి ఎదిగాడు. 1994లో రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేసి ఓటమిపాలయ్యారు. 2004లో టీడీపీతో పొత్తులో భాగంగా కడియం నియోజకవర్గం నుంచి, 2009లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...