ప్రత్యేక పోరాటానికి కవితమ్మ అందుకే మద్దతు తెలిపారేమో?
posted on Sep 2, 2015 2:56PM
.jpg)
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలులేదని పొరుగునున్న జయమ్మ, నవీన్ పట్నాయక్ ఇంకా ఎక్కడో వేల కిమీ దూరంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అభ్యంతరం చెపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో నిత్యం దేనికో దానికి గొడవ పడుతూ, ఏపీకి వ్యతిరేకంగా కేంద్రానికి పిర్యాదులు చేసే తెరాస మాత్రం మొదటి నుండి ఎపీకి ప్రత్యేక హోదా ఇస్తే తాము అభ్యంతరం చెప్పబోమని చెపుతూనే ఉంది. కానీ ఇంతవరకు ఎన్నడూ దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ మూడు రోజుల క్రితం, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల కుమార్తె కవితమ్మ స్వయంగా ఈ ప్రత్యేక పోరాటానికి మద్దతు పలికడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ చాలా హర్షించారు.
ఇదే స్ఫూర్తి అన్ని విషయాలలో కూడా చూపిస్తే ఎవరూ సందేహించేవారు కాదు. కానీ ఈ ప్రత్యేక హోదా వల్ల తెలంగాణాకు ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉందని తెలిసినా మద్దతు తెలపడం ఆలోచించవలసిన విషయమే. ఈ ప్రత్యేక పోరాటం కాంగ్రెస్ సువర్ణ హస్తాలలో ఉన్నంత కాలం తెరాస పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదిప్పుడు జగన్ చేతికి వచ్చిన తరువాత ‘కలిసి పోరాడుదాము’ అని ఆఫర్ ప్రకటించారు. ఆ చిన్నముక్క చాలు ఆ రెండు పార్టీల మధ్య ఉన్న చక్కటి అనుబంధానికి అర్ధం చేసుకోవడానికి. అయితే జగన్ దీని కోసం మోడీ ప్రభుత్వంతో పోరాటం చేయడం లేదనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ప్రత్యేక పోరాటం అంతా తన రాజకీయ బద్ద శత్రువు చంద్రబాబు నాయుడు మీదనే అనే సంగతి కూడా అందరూ గమనిస్తూనే ఉన్నారు. కనుక తమ ఉమ్మడి శత్రువుపై జగన్ చేస్తున్న ఆ ప్రత్యేక పోరాటానికి కవితమ్మ మద్దతు తెలపడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. బహుశః అందుకేనేమో కలిసి పోరాడుదామని అంటున్నారు.