కాంగ్రెస్‌వి దిక్కుమాలిన రాజకీయాలు



తెలుగు రాష్ట్రాల ప్రజలు తరిమి కొట్టినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదు. ఆ పార్టీ నాయకులు దిక్కుమాలిన రాజకీయాలు చేయడం మానలేదు. అడ్డగోలు విభజన కారణంగా దారుణంగా మోసపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ప్రత్యేక హోదా మీద తన దృష్టిని కేంద్రీకరించింది. ప్రత్యేక హోదా లభించినట్టయితే ఆంధ్రప్రదేశ్‌కి ఊరటగా వుంటుంది. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయట పడటానికి ఒక మార్గం దొరికినట్టు అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు, ప్రభుత్వం ఈ ప్రయత్నాల్లో వుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ విషయంలో దిక్కుమాలిన రాజకీయాలు ప్రదర్శిస్తున్నారు.

ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకు కీలకమైన అంశం. ఏపీకి ప్రత్యేక హోదా రావడం వల్ల ఇతర రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనేది ఊహాజనితమైన అంశమే తప్ప మరేదీ కాదు. ఏ రాష్ట్రంలోని నాయకులైనా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడగవచ్చు. అందులో తప్పేమీ లేదు. అయితే ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని అనడం మాత్రం న్యాయం కాదు. కాంగ్రెస్‌కి చెందిన తెలంగాణ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ మధ్య కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వరాదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందనేది ఆ లేఖ సారాంశం. పైగా లేఖ రాసిన తర్వాత ఆయన సదరు లేఖను తాను వ్యక్తిగతంగా రాశానని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

ఇలా తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఆంధ్రకు మంటపెట్టే లేఖ రాయగానే, ఏపీ కాంగ్రెస్ నాయకులు కస్సుమంటూ లేచారు. గుత్తా ఇలా లేఖ రాయడం అన్యాయం, అక్రమం, దారుణం అంటూ ఆవేశపడిపోయారు. ఇప్పటికే ఏపీలో సర్వనాశనమైపోయిన పార్టీని తిరిగి నిలబెట్టడానికి తాము నిద్రాహారాలు మాని ప్రయత్నిస్తుంటే గుత్తా ఇలాంటి లేఖలు రాయడం అన్యాయమని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని నినదించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ, ఏపీ నాయకులు ఇస్తున్న ఈ రాజకీయ కటింగులు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదని అనడం ద్వారా తెలంగాణలో ప్రజల మెప్పు పొందాలని గుత్తాగారు ప్రయత్నిస్తారు. గుత్తా మాటలను ఖండించి ఆక్రోశాన్ని వ్యక్తం చేయడం ద్వారా ఏపీ కాంగ్రెస్ నాయకులు ఏపీ ప్రజల సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా వున్న ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించే దిక్కుమాలిన రాజకీయాల నమూనా అని ప్రజలు అంటున్నారు.