అమరావతికి బ్యాంకులు, వ్యాపార సంస్థలు క్యూ

 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం రచిస్తున్న భారీ ప్రణాళికలు చూసి అప్పుడే బ్యాంకులు, పెద్దపెద్ద ప్రభుత్వ సంస్థలు, దేశ విదేశీ వ్యాపార సంస్థలు, పరిశ్రమలు రాజధానిలో తమ కార్యాలయాలను స్థాపించుకొనేందుకు తగిన స్థలం కేటాయించామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకొంటున్నాయి. వాటిలో నాబార్డ్ (ద నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ యండ్ రూరల్ డెవలప్మెంట్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా మరో అరడజను బ్యాంకులు ఉన్నాయి.

 

ఇక రాజధాని అమరావతిలో రూ.600 కోట్ల వ్యయంతో దాదాపు 5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనంలో టైర్-4 డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రత్యేకంగా దీనికోసమే 60 మెగావాట్స్ విద్యుత్ సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న నబార్డ్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని తాము అమరావతికి తరలించాలనుకొంటున్నామని, అందుకోసం రాజధానిలో తగినంత స్థలం కేటాయించవలసిందిగా తాము చేసిన విజ్ఞప్తికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ జీజి మమ్మేన్ తెలిపారు.

 

అదేవిధంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 900 శాఖలు, తెలంగాణా రాష్ట్రంలో 433 శాఖలు గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లుగా బ్యాంక్ (ఏపీ) చీఫ్ జనరల్ మేనేజర్ సి.ఆర్. శశికుమార్ తెలిపారు.

 

ఇవి కాక చిత్తూరులో శ్రీ సిటీ, నెల్లూరులో కృష్ణ పట్నం వద్ద నెలకొల్పిన లేదా నెలకొల్పబడుతున్న పరిశ్రమలు, రాష్ట్రంలో వివిద ప్రాంతాలలో ఏర్పాటవుతున్న వ్యాపార సంస్థలు, ఐటీ కంపెనీలు కూడా ఇంకా రాజధానికి శంఖుస్థాపన కూడా చేయకముందే తమ ప్రధాన కార్యాలయాలను రాజధాని అమరావతిలోనే ఏర్పాటు చేసుకొనేందుకు తగిన స్థలం కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఆంద్రప్రదేశ్ రాజధాని గురించి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అక్షేపిస్తున్నప్పటికీ, పెద్దపెద్ద సంస్థలు మాత్రం దాని వలన రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి జరగబోతోందని పసిగట్టినందునే త్వరలో నిర్మించబోయే రాజధానిలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి తొందరపడుతున్నాయని అర్ధమవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu