ఆంధ్ర బిర్లా ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అద్వితీయ ప్రస్థానం

posted on: Apr 30, 2026 2:40PM

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దార్శనికుడు ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే తెలుగు గడ్డపై పరిశ్రమల స్థాపన అవసరమని గుర్తించి, పారిశ్రామిక విప్లవానికి ఆయన బీజం వేశారు. 1921 జూలై 28న జన్మించిన ఆయన, తన 90 ఏళ్ల జీవిత ప్రయాణంలో కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, రాజకీయ నాయకుడిగా, విద్యాదాతగా, సమాజ సేవకుడిగా చెరగని ముద్ర వేశారు. ఆయన చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా ప్రజలు ఆయన్ని గౌరవంగా ‘ఆంధ్ర బిర్లా’ అని పిలుచుకుంటారు.  

ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ పారిశ్రామిక ప్రస్థానం 1947లో  ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ స్థాపనతో ప్రారంభమైంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అదే ఏడాది, ఎంతో ధైర్యంతో ఆయన వేసిన ఈ అడుగు ఆంధ్రదేశంలో పారిశ్రామిక పునర్నిర్మాణానికి పునాదిగా నిలిచింది. ఒక చక్కెర కర్మాగారంగా మొదలైన ఈ ప్రస్థానం, కాలక్రమేణా రసాయన, పెట్రో కెమికల్స్, టెక్స్టైల్స్ వంటి అనేక రంగాలకు విస్తరించింది.  శాస్త్ర, సాంకేతిక రంగాలలో ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్  ఉన్న ఆసక్తి అమోఘం. భారతదేశంలోనే తొలి ఆస్పిరిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అంతేకాకుండా..  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐస్రో)కు అవసరమైన రాకెట్ ఇంధనాన్ని సరఫరా చేసే యూనిట్‌ను తణుకులో నెలకొల్పి, దేశ రక్షణ,  అంతరిక్ష రంగాలలో తన వంతు పాత్ర పోషించారు. ఇది ఆయన దూరదృష్టికి మరియు స్వదేశీ సాంకేతికతపై ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం.  పారిశ్రామిక రంగంలోనే కాకుండా..  రాజకీయాల్లోనూ హరిశ్చంద్ర ప్రసాద్ తనదైన శైలిని ప్రదర్శించారు. తణుకు నియోజకవర్గం నుండి 1955,  1961లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. ఆ తర్వాతి కాలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.  1981లో తణుకు మున్సిపాలిటీకి తొలి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజా ప్రతినిధిగా ఆయన అందించిన సేవలు నేటికీ ఆ ప్రాంత ప్రజల మదిలో సజీవంగా ఉన్నాయి.  సామాజిక బాధ్యతలో భాగంగా విద్యా, వైద్య రంగాల్లో ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. కాకినాడలోని ప్రసిద్ధ రంగరాయ మెడికల్ కాలేజ్ ఏర్పాటులో ఆయన పాత్ర కీలకం. 

అలాగే తణుకులో ఎస్‌.ఎం.వి.ఎం పాలిటెక్నిక్ కళాశాల, ముళ్లపూడి వెంకట రామణమ్మ మెమోరియల్ హాస్పిటల్ వంటి సంస్థలను స్థాపించి, సామాన్యులకు ఉన్నత చదువులను, నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సంస్థలు నేటికీ వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.  ఆయన నాయకత్వంలో ఆంధ్ర పెట్రోకెమికల్స్, జయలక్ష్మి ఆయిల్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్, శ్రీ అక్కమాంబ టెక్స్టైల్స్ వంటి సంస్థలు విజయవంతంగా నడిచాయి. పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. తెలుగు తల్లి అవార్డు, ఫ్యాప్సీ అధ్యక్ష పదవి వంటి ఎన్నో పురస్కారాలు ఆయనను వరించాయి.  హరిశ్చంద్ర ప్రసాద్  చూపిన బాట నేటి తరం పారిశ్రామికవేత్తలకు ఒక పాఠం. లాభార్జన మాత్రమే ధ్యేయంగా కాకుండా, సామాజిక అభివృద్ధి, దేశాభివృద్ధిని కాంక్షించిన ఆయన ఆశయాలు చిరస్మరణీయమైనవి. 2011 సెప్టెంబర్ 3న ఆయన భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆయన నిర్మించిన సంస్థలు, అందించిన సేవలు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. తెలుగు ప్రజలు గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిత్వం ఆయనది.  

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com ఫాలో అవ్వండి, షేర్ చేయండి 

google-ad-img
    Related Sigment News
    • Loading...