మాయమై పోయిండమ్మా అందెశ్రీ అన్నవాడూ!
posted on Nov 10, 2025 1:33PM

అందెశ్రీ ఈ పేరు వింటే మొదట గుర్తుకు వచ్చేది.. పల్లె పాట. జనం మాట. జానపదులు పాడుకునే ఆట పాట. ఎలాంటి చదువు చదవు లేకుండానే.. మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అంటూ ఆయన రాసిన పాట ఏకంగా ఒక పాఠ్యపుస్తకంలో సిలబస్ గా మారిన ఘనత చరిత సొంతం చేసుకుందంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఇక జయజయహే తెలంగాణ అనే రాష్ట్ర గీతం గురించి చెప్పనక్కర్లేదు. ఇదిప్పుడు ప్రతి బడిలో పాడుకునే పాటగా ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి పాడుకోవల్సిన బాటగా మారింది.
వరంగల్ జిల్లా జనగాం దగ్గర్లోని రేబర్తి అనే గ్రామంలో 1961 జూలై 18న జన్మించారు అందె శ్రీ. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. అనాథగా పెరిగిన ఎల్లయ్య తొలినాళ్లలో పశువుల కాపరిగా పని చేసేవారు. ఆయన ప్రకృతిలోని ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు ప్రేరణ చెంది పాటలు రాసేవారు. అది కూడా రాయడం తెలీకుండానే ఆశువుగా చెప్పిన కవిత్వం పాటమ్మగా మారి అది పల్లె పల్లెనా పరవళ్లు తొక్కి.. జనం గుండెలను తాకేది.
అలా అలా ఇంటిపేరు అందె కి శ్రీ కలుపుకుని అందెశ్రీగా ప్రాచుర్యం పొందారు ఎల్లయ్య. ఎక్కడ పశువుల కాపరి ఉద్యోగం? ఎక్కడ ప్రకృతికి పరవశించి పాడిన పాట? ఆపై అది పాఠ్యపుస్తకాలకు ఎక్కడం ఏమిటీ? కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అయితేనేమి ఇంకా ఎన్నో ప్రసిద్ధ పురస్కారాల వరకూ సాగిన ఈ పాటల ప్రయాణం తెలంగాణ సాహిత్యంలోనే ఒక ప్రత్యేక అధ్యాయం.
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అంటూ తెలంగాణ మాతృగీతం రాయడంతో పాటు అందెశ్రీ.. రాసిన గీతాలేంటో చూస్తే.. పల్లెనీకు వందనములమ్మో,మాయమై పోతున్నడమ్మో మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జెలబండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, జన జాతరలో మన గీతం
యెల్లిపోతున్నావా తల్లి, చూడ చక్కని వంటి ఎన్నో పాటలు రాశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే గంగ, బతుకమ్మ, ఆవారాగాడు అంటూ పలు చిత్రాలకు గేయ రచన చేశారు అందెశ్రీ. గంగ చిత్రానికి గానూ నంది అవార్డు అందుకోగా, బతుకమ్మ చిత్రానికి సంభాషణలు కూడా అందించారు అందెశ్రీ. 2014లో తెలంగాణ ప్రభుత్వం అందెశ్రీ పేరు పద్మశ్రీకి ప్రతిపాదించింది.
అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్ టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్ తోపాటు లోకకవి అన్న బిరుదులు దక్కాయి. 2015లో వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం ఇచ్చి సత్కరించారు. డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం సైతం లభించింది.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా కీలక పాత్ర పోషించారు అందెశ్రీ. అంతేకాకుండా తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించారు అందెశ్రీ.ఇక సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారంతో పాటు అందెశ్రీని లోక్ నాయక్ పురస్కారం సైతం వరించింది. ఇటీవల సీఎం రేవంత్ చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారం సైతం పొందారు అందెశ్రీ.
ఇలా చెప్పుకుంటూ పోతే మట్టిలో పుట్టిన ఈ తేనె తుట్టెలాంటి పాట అంతర్జాతీయంగాను విస్తరించి అక్కడా గుర్తింపు పొంది ఎన్నో అవార్డులూ రివార్డులను పొందింది. అందెశ్రీ 2025 నవంబర్ 10న అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఇది పల్లపాటకు విషాదకరమైన రోజు. చదువులమ్మ తల్లి చింతించాల్సిన రోజు. తెలంగాణ మట్టిలో మాణిక్యం దిగంతాలకు ఏగిన రోజు. ఓ పాట కాలం మనిషీ, ఆ పాట మధురాలను మనకు అందించిన మనిషీ.. ఇలా దివికేగడంతో తెలంగాణ సాహిత్యం శోకసంద్రంలో మునిగిపోయిన రోజుకూడా ఇదే. పాటల్లో ఎన్నో తంగేడు పూలను, పాలపిట్ల కేరింతలను పూన్చిన ఓ మనిషీ.. నువ్విలా అర్ధంతరంగా వెళ్లిపోయి నీలోని మానవత్వాన్ని మాయం చేశావా! అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాహితీ అభిమానులు.