రేపు అందెశ్రీ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం రేవంత్
posted on Nov 10, 2025 3:24PM
.webp)
ప్రముఖ కవి అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. రేపు ఘట్ కేసర్ ఎన్ఎఫ్‍సీ నగర్‌లో అందెశ్రీ అంతిమ యాత్ర జరగనున్నాది. రేపు సాయంత్రం ఆయన పార్థివదేహాన్నికి ముఖ్యమంత్రి నివాళి అర్పించనున్న అనంతరం అంతిమ యాత్రలో పాల్గొననున్నారు. కాగా ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించిన అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్మి కె.రామకృష్ణరావును ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు పశువుల కాపరి నుంచి ప్రసిద్ధ కవిగా ఎదిగిన అందెశ్రీ మృతి పట్ల పలవురు ప్రముఖులు, సాహితీ వేత్తలు
సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1961, జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు ప్రజాకవి, గాయకుడు అందె ఎల్లయ్య అందెశ్రీగా ఖ్యాతి పొందిన ఆ మహామనిషి. గొర్రెల కాపరిగా, తాపీ మేస్త్రీగా కష్టసుఖాలను అనుభవించిన ఆయన, బాధను మర్చిపోయేందుకు పాడిన పాటలే ఆయన జీవితానికి మార్గదర్శకంగా మారాయి. ఆ గీతాలే ఆయనను ప్రజల కవి, పోరాట గాయకుడిగా తీర్చిదిద్దాయి. అవే ఆయనకు ప్రశ్నించే ధైర్యం, సమాజం కోసం పలికే స్వరాన్ని ఇచ్చాయి.
“పల్లెనీకు వందానాలమ్మో”, “సూడా సక్కని తల్లీ... చుక్కల్లో జాబిల్లీ”, “కొమ్మచెక్కితే బొమ్మరా... కొలిచి మొక్కితే అమ్మరా”, “మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు” ఇలా ఆయన గళం నుంచి జాలువారిన ప్రతి పాట తెలంగాణ ఆత్మను తాకింది. చివరికి, తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రూపంలో ఆయన సాహిత్య ప్రస్థానం చిరస్మరణీయమైంది.
తాపీ మేస్త్రీగా పనిచేసిన అందెశ్రీ చేతులు తెలంగాణ నిర్మాణానికి ఇటుకలు పేర్చినట్లే, ఆయన గళం ఆ ఉద్యమానికి బలమైన పునాది వేసింది. పశువుల కాపరిగా మందను దారి చూపినట్లే, ప్రజాకవిగా ఆయన తరతరాలను మేల్కొలిపారు. దగాపడిన తెలంగాణ కోసం తన మాటతో, తన పాటతో పోరాడిన ఆ గాయకుని గాధ పల్లెపల్లెల్లో నేటికీ మార్మోగుతోంది. అందెశ్రీ శరీరం లేనప్పటికీ, ఆయన గీతాల గర్జన మాత్రం చిరస్థాయిగా మారింది.